‘హస్తం’లో కదలిక | - | Sakshi
Sakshi News home page

‘హస్తం’లో కదలిక

May 7 2025 12:07 AM | Updated on May 7 2025 12:07 AM

‘హస్తం’లో కదలిక

‘హస్తం’లో కదలిక

● ఇక కాంగ్రెస్‌ కమిటీలు ● నేడు నియోజకవర్గ సమావేశాలు ● గ్రామ, మండల, బ్లాక్‌ కమిటీ అధ్యక్షుల ఎంపికకు.. ● ఒక్కోదానికి ఐదుగురి పేర్లు ● 20లోగా ఖరారు చేయనున్న పీసీసీ ● ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడి ఎంపిక

సాక్షి,ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతోంది. అయినా తమకు పదవుల పరంగా న్యాయం దక్కడం లేదని వాపోతున్న కార్యకర్తలకు త్వరలోనే తీపికబురు అందనుంది. ఎట్టకేలకు పార్టీలో అన్ని స్థాయిల్లో కమిటీల భర్తీకి అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన పరిశీలకుల ద్వారా ఈ కమిటీల ఎంపికకు ముందడుగు పడింది. నేడు నియోజకవర్గం వారీగా హస్తం పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్‌ సమావేశం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ తరంగిణి ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 9 గంటలకు ఖరారు చేశారు. బోథ్‌ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చోడలోని అభినందన్‌ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. టీపీసీసీ నుంచి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హుందాన్‌, టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణలను జిల్లాకు నియమించిన విషయం తెలిసిందే. వీరి ఆధ్వర్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులోనే ఈ కమిటీల నియామకం విషయాన్ని స్పష్టం చేశారు. మే 3 నుంచి ఎంపిక ప్రక్రియ షురూ అవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా బుధవారం ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గ సమావేశాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.

అన్ని స్థాయిల్లో కమిటీలు..

రెండేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఎలాంటి కమిటీలు లేకపోవడంతో పార్టీలో నిస్తేజం కనిపించింది. కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడింది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవే ఖాళీగా ఉండడంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వారే కరువయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలు వారి వారి పరిధిలో కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ పరంగా ఎలాంటి కమిటీలు లేకపోవడంతో వారిలో నిరాశ వ్యక్తమైంది. ఈ పరిస్థితిలో అధిష్టానం అన్ని స్థాయిల్లో కమిటీలను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, మండల, బ్లాక్‌ కమిటీలకు మొదట అధ్యక్షులను నియమించనున్నారు. ఇందుకోసమే నియోజకవర్గం వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఒక్కో కమిటీకి ఐదుగురి పేర్లు..

గ్రామ, మండల, బ్లాక్‌ కమిటీలకు సంబంధించి ఒక్కో దాని కోసం ఐదుగురి పేర్ల చొప్పున పరిశీలకులు సేకరించనున్నారు. ఆ పేర్లను టీపీసీసీకి నివేదిస్తారు. ఆ తర్వాత అందరి ఆమోదంతో ఆ కమిటీలకు అధ్యక్షులను నియమిస్తారు. ఇదిలా ఉంటే పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ జిల్లాలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు మినహాయిస్తే అనేక చోట్ల ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. పాత, కొత్త నాయకులను కలుపుకొని వెళ్తుందా.. లేనిపక్షంలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యతనిస్తుందా.. అలా అయిన పక్షంలో కార్యకర్తల మద్దతు ఎలా ఉంటుంది.. ఇలా అన్ని అంశాలు పార్టీలో ప్రస్తుతం ప్రాధాన్యత కలిగిస్తున్నాయి.

డీసీసీ అధ్యక్షుడు కూడా..

గ్రామ, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలను ఈనెల 20లోగా ఎంపిక చేయనున్నారు. అవి పూర్తయిన వెంటనే పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. అందులో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ముగ్గురి పేర్లను పరిశీలకులు సేకరిస్తారని చెబుతున్నారు. టీపీసీసీకి నివేదించి, ఈనెల చివరిలోగా జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పరంగా అన్ని స్థాయిల్లో కమిటీలను పటిష్టం చేయడం ద్వారా ముందుకెళ్లాలని అధిష్టానం భావిస్తుంది. ఆ మేరకు కార్యాచరణ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement