
ప్రజావాణిలో ‘ఇందిరమ్మ’ గోడు
● భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ప్రజావాణిపై ప్రభావం చూపాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడు లేని విధంగా భారీగా తరలివచ్చారు. ఇందులో అత్యధికులు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని నివేదించిన వారే కావడం గమనార్హం. మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన వారు ఉన్నతాధికారుల ఎదుట తమగోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్ రాజర్షి షా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2గంటలు కావడంతో కార్యక్రమం ముగించినట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో అధికారులంతా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ సైతం బయలుదేరుతుండగా అప్పటికే బయట పెద్ద సంఖ్యలో ఉన్న అర్జీదారులు ఒక్కసారిగా సమావేశ మందిరంలోకి వచ్చారు. దీంతో కలెక్టర్ అరగంట పాటు నిలబడే వారి నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన పొరపాట్లపై విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. అధికారికంగా 148 అర్జీలు అందినట్లుగా అధికారులు చెబుతున్నప్పటికీ మరో 80 మంది వరకు ఆన్‌లైన్ చేయకుండానే చివ రి నిమిషంలో నేరుగా అందజేశారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధశాఖల అధికారులు పా ల్గొన్నారు. ఈవారం అర్జీదారుల్లో కొందరి నివేదన..
పనివేళలు కుదించాలి
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేయిస్తున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరగడంతో కార్మికులు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా పని వేళలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే కుదించాలి.
– టీఎమ్మార్పీఎస్ నాయకులు, ఆదిలాబాద్
ఈ మేరకు స్పందించిన కలెక్టర్ వెంటనే కమిషనర్ రాజుతో మాట్లాడారు. కార్మికులతో ఉదయం 11గంటల వరకు మాత్రమే పనులు చేయించాలని ఆదేశించారు.