
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కామన్ సింబల్ ఉండగా వారు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్‌కు కారు, కాంగ్రెస్‌కు హస్తం, బీజేపీకి కమలం, బీఎస్పీకి ఏనుగు గుర్తులుండగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాగా, స్వతంత్రులుగా బరిలో నిలిచిన అభ్యర్థులకు ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గురువారం గుర్తులు కేటాయించారు.
నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మూడు గుర్తుల్లో ఒక దాన్ని వారి ప్రాధాన్యత ప్రకారం కేటా యించారు. ప్రచారానికి మరో 11రోజులే ఉండగా తమ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నామినేషన్లు వేసిన నుంచి కొందరు తమ ఫొటోలతో ప్రచారం చేసుకోగా, ఇంకొందరూ గుర్తులు వచ్చేదాకా వేచి చూశారు.
తాజాగా గుర్తులు ఖరారు కాగా, ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. తమ గుర్తులు, ఫొటోలతో కూడిన ప్రచార రథాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరు అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా తమ పేర్లు, గెలిపిస్తే చేపట్టే కార్యక్రమాలు వివరించే ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. కాగా, 10 మందికి పైగా అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉండగా వారు ఏ పార్టీ ఓట్లకు గండి కొట్టనున్నారో అనే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
ఆదిలాబాద్‌లో రెండు ఈవీఎంలు..
ఆదిలాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 27 మంది బరిలో ఉన్నారు. దీంతో ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రెండు ఈవీఎంలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15మంది అభ్యర్థులు, నోటాతో కలిపి ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులు మాత్రమే ఉండటంతో ఇక్కడ రెండు ఈవీఎంలు తప్పనిసరి కానున్నాయి.
ఓట్లకు గండి పడుతుందనే ఆందోళన!
గుర్తింపు లేని పార్టీలతో పాటు స్వతంత్రులు భారీ సంఖ్యలో బరిలో ఉండటం ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవర పరుస్తోంది. ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండనుంది. కాగా, స్వతంత్రులు ఏ పార్టీ ఓట్లకు గండి కొడుతారనే ప్రధాన చర్చ సాగుతోంది. వారికి పడే ఓట్లు తమ మెజార్టీని తగ్గిస్తాయనే గుబులు కూడా ఆయా పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. అలాంటి ప్రభావం ఏమాత్రం పడకుండా ఆయా పార్టీల శ్రేణులను అప్రమత్తం చేస్తూ గడపగడపకూ వెళ్లేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
బోథ్ నియోజకవర్గ అభ్యర్థుల గుర్తులివే..
బోథ్: నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియగా గురువారం అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. బోథ్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు కారు, కాంగ్రెస్ అభ్యర్థి ఆడె గజేందర్‌కు హస్తం, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్‌కు కమలం, బీఎస్పీ అభ్యర్థి జంగు బాపునకు ఏనుగు, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి ఆడె సునీల్‌కు గన్నా కిసాన్, రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అభ్యర్థి హీరాజీకి బాక్స్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి ఉయికె ఉమేశ్‌కు బ్యాటరీ టార్చ్, గొండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థి బాదు నైతంకు రంపం, స్వతంత్ర అభ్యర్థులు జాదవ్ భోజ్యానాయక్‌కు కుట్టుమిషన్, తొడసం ధనలక్ష్మికి బ్లాక్‌బోర్డు గుర్తులు కేటాయించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ అభ్యర్థుల గుర్తులు..
బలిరాజ పార్టీ అభ్యర్థి సత్యనారాయణకు చెస్‌బోర్డు, అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ అభ్యర్థి ఎం.భూపేందర్‌కు చపాతి రోలర్, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి సూర్యవంశీ విద్యాసాగర్‌కు మంచం గుర్తు కేటాయించారు. ఇండిపెండెంట్లలో అన్నం ప్రేమ్‌దేవేందర్‌కు సీసీటీవీ కెమెరా, అల్లూరి సంజీవ్‌రెడ్డికి ఉంగరం, అస్లాంకు కెమెరా, కలమడుగు విజయ్‌కుమార్‌కు యాపిల్, గేడాం జనార్దన్‌కు తురా ఊదుతున్న మనిషి, తస్కండే ధరంపాల్‌కు డోలి, తక్‌బిడే పండిత్‌రావుకు అగ్గిపెట్టె, గాలిపెల్లి నాగన్నకు గ్యాస్ స్టవ్, భాను రాజేశ్వర్‌రావుకు కుండ, బెదోడ్కర్ గణేశ్‌కు బెల్, ముండే ప్రవీణ్‌కుమార్‌కు బ్యాట్, వాగ్మారే అభిషేక్‌కు మైక్, వాతే సుభాష్‌కు టీవీ రిమోట్ గుర్తులు కేటాయించారు.
ఇవి చదవండి: ‘కరెంట్ కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా..!?' : ముఖ్యమంత్రి కేసీఆర్