కుష్ఠు అనుమానితులు @ 828 | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు అనుమానితులు @ 828

Jan 3 2026 7:01 AM | Updated on Jan 3 2026 7:01 AM

కుష్ఠు అనుమానితులు @ 828

కుష్ఠు అనుమానితులు @ 828

● జిల్లాలో గుర్తింపు ప్రక్రియ పూర్తి ● నెల పాటు కొనసాగిన సర్వే ● ఈనెల 5 నుంచి నిర్ధారణ పరీక్షలు

ఆదిలాబాద్‌టౌన్‌: కుష్ఠు అనుమానితుల లెక్క తేలింది. గత నెల రోజుల పాటు కుష్ఠు గుర్తింపు ఉద్యమం కొనసాగింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టి అనుమానితులను గుర్తించారు. ఈనెల 5 నుంచి పీహెచ్‌సీల వారీగా వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. 13వ తేది వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అవసరమైన సిబ్బందికి విధులు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో 52 మంది వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ నిర్ధారణ పరీక్షల్లో మరికొంత మంది పెరిగే అవకాశం ఉంది.

828 అనుమానితులు..

డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 1,006 మంది ఆశ కార్యకర్తలు ఈ సర్వే చేపట్టారు. ఇంటింటికి వెళ్లి శరీరంపై గోదుమ రంగు పోలిన, స్పర్శ లేని మచ్చలను గుర్తించారు. జిల్లాలో 22 పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో అత్యధికంగా చిల్కూరి లక్ష్మినగర్‌లో 25, శాంతినగర్‌లో 20, ఖుర్షీద్‌నగర్‌లో 12 మంది అనుమానితులు ఉండగా, హస్నాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 90, ఇచ్చోడ పీహెచ్‌సీలో 60, గాదిగూడలో 54, నేరడిగొండలో 70, శ్యామ్‌పూర్‌లో 51 మంది కలిపి మొత్తంగా 828 మందిని గుర్తించారు. వీరందరికీ ఆయా పీహెచ్‌సీలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించనున్నారు. నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించనున్నారు.

ఈనెల 5 నుంచి 13 వరకు..

ఈనెల 5 నుంచి 13వరకు ఆయా పీహెచ్‌సీల పరిధి లో నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశారు. 5న బజార్‌హత్నూర్‌, సొనాల, నేరడిగొండ, ఇచ్చోడ, నర్సాపూర్‌(టి), గుడిహత్నూర్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 6న భీంపూర్‌, తాంసి, తలమడుగు, 7న గిమ్మ, జైనథ్‌, బేల, 8న పిట్టబొంగరం, ఇంద్రవెల్లి, శ్యామ్‌పూర్‌, దంతన్‌పల్లి, 9న సైద్‌పూర్‌, గాదిగూడ, ఝరి, నార్నూర్‌, హస్నాపూర్‌, 10న అంకోలి, 13న ఆదిలాబాద్‌ పట్టణంలోని పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు.

స్వచ్ఛందంగా ముందుకురావాలి

కుష్ఠు అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయిన వారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మందులు వాడితే 6 నుంచి 12 నెలల్లో నయం అవుతుంది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన సర్వేలో 828 మందిని అనుమానితులుగా గుర్తించాం. ప్రస్తుతం జిల్లాలో 52 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కుష్ఠు రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలి.

– నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement