చలితో అప్రమత్తంగా ఉండాలి
సైనస్ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి
చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు బయటకు వెళ్లొద్దు
మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి
రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విఠల్ ఆడే
ఆదిలాబాద్‌టౌన్: చలి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విఠల్ ఆడే అన్నారు. ప్రస్తుతం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న చలి తీవ్రత ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: చలి ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..
డాక్టర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతున్నాయి. దీంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, గుండెపోటు, అస్తమా వ్యాధిగ్రస్తులు, కిడ్నీ బాధితులు జాగ్రత్తలు పాటించాలి. సైనస్ సమస్య ఉన్నవారు చలిలో బయటకు వెళ్లకూడదు. జలుబు, దగ్గు, గొంతు సమస్యతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
సాక్షి: ఈ సీజన్‌లో ఏయే వ్యాధులు ప్రబలుతాయి..
డాక్టర్: చలి కారణంగా జలుబు, దగ్గు, తలనొప్పితో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతుతాయి. నిమోనియా, బ్రాంకై టీస్, జ్వరం, ఇన్‌ఫ్లూ, గొంతు ఇన్‌ఫెక్షన్, సైనసైటీస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్ల ల్లో నిమోనియా, ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు ఇబ్బందులకు గురవుతారు.
సాక్షి: ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి..
డాక్టర్: ఈ సీజన్‌లో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్ తీసుకోవద్దు. వీటితో గొంతు ఇన్‌ఫెక్షన్ వస్తుంది. వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. జ్వరం వచ్చి మూడు రోజుల పాటు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.
సాక్షి: చలికాలంలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు వస్తాయి.. కారణమేమిటి..?
డాక్టర్: చలికాలంలో గుండె పోటుకు సంబంధించి కేసులు నమోదవుతాయి. ప్రధానంగా బ్లడ్ క్లాట్ కావడం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దినచర్యలో భాగంగా ఉదయం ఎండ వచ్చిన తర్వాత, సాయంత్రం నడక ఆరోగ్యానికి మంచిది.
సాక్షి: ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
డాక్టర్: డిసెంబర్ నెల నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. వెచ్చదనం కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. గ్లౌజులు, స్వెట్టర్లు, టోపీలు ధరించడం మంచిది. మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. మెడికల్ షాప్‌లకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు యాంటీబయోటిక్ వాడొద్దు.


