రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
జైనథ్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. మండలంలోని కాప్రి గ్రామ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై జైనథ్, బేలా మండలాల రైతులతో కలిసి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా సోయా పంట రంగుమారితే కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమమన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రహ్లాద్, నర్సింగ్‌రావు, లింగారెడ్డి, మనోహర్, గంభీర్, గణేశ్‌యాదవ్, గోవర్ధన్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.


