
బుట్టాయగూడెం: అందమైన అడవి మధ్యలో వెలసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ.. చుట్టూ ఎత్తైన కొండలు.. కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తుల పూజలందుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా (Gubbala Mangamma Thalli) ప్రసిద్ధి చెందింది.

గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చె తల్లిగా పేరు పొందింది

దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు.

ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు

గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులను విక్రయిస్తుంటారు.

మంగమ్మతల్లి వెలిసిన సమీపంలోనే గానుగ చెట్టు ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు, కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలాచేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని విశ్వాసం.

ప్రతీ ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ప్రతి ఆదివారం 3 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. మంగళ, శుక్రవారాల్లో 2 నుంచి 3 వేల మంది వరకూ వస్తారు.

మంగమ్మతల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కామవరం దాటిన తరవాత కొంత దూరం వేళ్లే సరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరి కొంత దూరం వెళ్లిన తర్వాత గుబ్బల మంగమ్మతల్లి దర్శనం కలుగుతుంది.

గుడికి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్లొచ్చు.












