gubbala mangamma thalli
-
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
-
అడవి మధ్యలో వెలసిన.. గుబ్బల మంగమ్మతల్లి
బుట్టాయగూడెం: అందమైన అడవి మధ్యలో వెలసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ.. చుట్టూ ఎత్తైన కొండలు.. కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తుల పూజలందుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందింది. బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగాను అందరినీ ఆకర్షిస్తోంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చె తల్లిగా పేరు పొందింది. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు. త్రేతాయుగంలోనే గుబ్బల మంగమ్మ ప్రస్తానం గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. త్రేతాయుగంలోనే వెలసినట్లు చెబుతుంటారు. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రత ధాటికి మంగమ్మతల్లి నివసిస్తున్న గుహ కూలి పోయిందట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా.. దేవతలు ప్రత్యక్షమై మంగమ్మతల్లిని శాంతింపచేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు. సేలయేర్ల మధ్య గుబ్బల గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిందని ప్రతీతి. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గెడలు తెచ్చేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో.. బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట. రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మతల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని.. తనను దర్శించుకున్నాక వెదురు తీసుకు వెళ్లాలని చెప్పింది. కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మతల్లి వెలసిన ప్రదేశాన్ని దర్శించుకున్న అమ్మ వారికి పూజలు చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మంగమ్మతల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. గిరిపుత్రులే పూజారులు ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు. వారే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గిరిజనులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులను విక్రయిస్తుంటారు. మంగమ్మతల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. మంగమ్మతల్లి వెలిసిన సమీపంలోనే గానుగ చెట్టు ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు, కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలాచేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని విశ్వాసం. ప్రతీ ఆదివారం 3 వేల మందికి పైగా రాక ప్రతీ ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇటీవల భక్తుల రాక తగ్గింది. ప్రతి ఆదివారం 3 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. మంగళ, శుక్రవారాల్లో 2 నుంచి 3 వేల మంది వరకూ వస్తారు. రద్దీ పెరగడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగడం వల్ల రద్దీ తగ్గుతుంది. గుబ్బల మంగమ్మతల్లి గుడి వద్ద గత రెండేళ్ల నుంచి మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు. అడవిలో ప్రయాణం ఆహ్లాదభరితం మంగమ్మతల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కామవరం దాటిన తరవాత కొంత దూరం వేళ్లే సరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరి కొంత దూరం వెళ్లిన తర్వాత గుబ్బల మంగమ్మతల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎతైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. గుడికి ఎలా వెళ్లాలి.. గుడికి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్లొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, రామారావుపేట సెంటర్, అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం మీదుగా కూడా వెళ్లొచ్చు. తెలంగాణ నుంచి వచ్చే వారు అశ్వారావుపేట నుంచి రాచన్నగూడెం, పూచికపాడు మీదుగా వేపులపాడు, పందిరిమామిడిగూడెం మీదుగా దర్శనానికి రావచ్చు. అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా అటవీమార్గంలో మంగమ్మతల్లిని దర్శించుకోవచ్చు. -
చల్లగ చూసే వనదేవత
పచ్చని అటవీ ప్రాంతం... ఎటు చూసినా చెట్టు చేమలు... చుట్టూ కొండలు, కోనలు... అక్కడక్కడా పారే సెలయేటి గలగలలు... పశ్చిమగోదావరి-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభువుగా వెలిసింది శ్రీశ్రీశ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి. బుట్టాయగూడెం మండలం కోర్సావారిగూడెం పంచాయతీ పరిధిలో ఉంది ఈ వనదేవత ఆలయం. గిరిజనులకు కొంగు బంగారంగా తరతరాలుగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మైదానప్రాంతాల భక్తులు కూడా పెద్దసంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. స్థలపురాణం: ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలోనే వెలిసినట్లు ప్రతీతి. సీతా రామలక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెబుతారు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరువలోని పురాతనమైన రెండు మామిడి చెట్లను రామలక్ష్మణులని భక్తులు పిలుచుకుంటారు. ద్వాపరయుగంలో పాండవులు కూడా అరణ్యవాస కాలంలో ఈ అడవిలో సంచరించినట్లు చెబుతారు. అప్పట్లో ఇక్కడ కొందరు రాక్షసులు సంచరించేవారట. రాక్షసులు వారిలో వారు కలహించుకున్నప్పుడు పెద్ద యుద్ధం జరిగిందట. రాక్షసుల పోరులో గుబ్బల మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. దీంతో కోపగించిన మంగమ్మ తల్లి రాక్షసులను సంహరించిందని, ఆమె ఆగ్రహజ్వాలలకు ప్రకృతి అల్లకల్లోలం కాగా, దేవతలంతా దిగివచ్చి, ప్రార్థనలు చేసి ఆమెను శాంతింపజేశారని స్థలపురాణం చెబుతోంది. నాటి నుంచి గలగల పారే సెలయేటి నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో మంగమ్మ తల్లి వెలిసిందని, అందుకే గుబ్బల మంగమ్మ తల్లిగా ప్రసిద్ధి పొందిందని చెబుతారు. మంగమ్మ తల్లికి తోడుగా ఇక్కడ గంగమ్మ, నాగమ్మ తల్లులు కూడా వెలిసినట్లు చెబుతారు. నేపథ్యం: బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే ఆసామి 32 ఏళ్ల కిందట వెదురు కోసం అడవికి వెళ్లారు. వెదురు సేకరించి, ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమవుతూ ఉండగా, తోవలో బండి తిరగబడింది. ఇలా ఎందుకు జరిగిందా అని కృష్ణమూర్తి ఆలోచించినా, ఆయనకు కారణమేదీ అంతుచిక్కలేదు. ఆ రాత్రి ఆయన నిద్రించినప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించిందట. అడవిలోని సెలయేటి మధ్యనున్న గుహలో తాను కొలువై ఉన్నట్లు చెప్పిందట. ఆ కలతో మెలకువలోకి వచ్చిన కృష్ణమూర్తి తెల్లవారు జామునే గ్రామస్థులతో కలసి వెళ్లి చూడగా గుహలో కొలువై ఉన్న మంగమ్మ తల్లి దర్శనమిచ్చిందట. వెంటనే ఆయన మంగమ్మ తల్లికి పూజలు చేశారట. ఆ తర్వాత ఇక్కడ స్వయంభువుగా వెలసిన మంగమ్మ తల్లి గురించి ప్రచారం చేయడంతో భక్తుల రాక పెరిగింది. అప్పటి నుంచి ప్రతి ఆదివారం, మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడకు రావడం మొదలైంది. ఆలయానికి రద్దీ పెరుగుతుండటంతో దీనిని స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇక్కడి కొండరెడ్లు తామే ఈ ఆలయం బాగోగులు చూసుకుంటామని చెప్పడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీలు ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తూ ఉంటారు. - డీవీ భాస్కరరావు జంగారెడ్డిగూడెం , పశ్చిమగోదావరి ఇలా చేరుకోవాలి గుబ్బల మంగమ్మ ఆలయం జంగారెడ్డిగూడేనికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూర ప్రాంతాలవారు జిల్లా కేంద్రం ఏలూరు వరకు రైలులో రావచ్చు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని జంగారెడ్డిగూడెం వరకు బస్సులో చేరుకుని, అక్కడి నుంచి మంగమ్మ ఆలయానికి బస్సు లేదా ఇతర వాహనాల్లో రోడ్డుమార్గం గుండా చేరుకోవాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి విమానమార్గంలో వచ్చేవారు విజయవాడ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. ఇక్కడ రాత్రివేళ బస చేయరాదనేది ఆచారం. అందువల్ల ఆలయ సందర్శన పూర్తయిన తర్వాత జంగారెడ్డిగూడెం చేరుకుని, అక్కడి హోటళ్లలో బస చేయవచ్చు. జంగారెడ్డిగూడెంలో పర్యాటకులకు సౌకర్యవంతమైన బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.