ముక్కలుగా జవాను దేహం.. రివేంజ్‌కు సైన్యం..! | soldier body is mutilated, Army vows revenge | Sakshi
Sakshi News home page

ముక్కలుగా జవాను దేహం.. రివేంజ్‌కు సైన్యం..!

Oct 29 2016 11:30 AM | Updated on Oct 22 2018 8:34 PM

ముక్కలుగా జవాను దేహం.. రివేంజ్‌కు సైన్యం..! - Sakshi

ముక్కలుగా జవాను దేహం.. రివేంజ్‌కు సైన్యం..!

జవాన్‌ భౌతికకాయాన్ని ఉగ్రవాదులు ముక్కలుగా నరకడంతో భారత సైన్యం రగిలిపోతోంది..

ఎదురుకాల్పుల్లో మరణించిన జవాన్‌ భౌతికకాయాన్ని ఉగ్రవాదులు ముక్కలుగా నరకడంతో భారత సైన్యం రగిలిపోతోంది. ఉగ్రవాదుల ఈ దుర్మార్గకాండపై తగినరీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది.

శుక్రవారం సాయంత్రం జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టర్‌లో ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఒకవైపు పాక్‌ సైన్యం కాల్పులతో చెలరేగుతుండగా.. ఇదే అదనుగా తీసుకొని కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని భారత సైన్యం అడ్డుకోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మిలిటెంట్‌ మృతిచెందగా.. భారత సైనికుడు కూడా అమరుడయ్యడు. సైన్యం కాల్పులతో తోకముడిచిన ఉగ్రవాదులు.. అమరుడైన సైనికుడి దేహాన్ని ముక్కలు నరికి.. అనంతరం పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌ (పీవోకే)లోకి పారిపోయారు. ఈ దుర్మార్గ చర్యపై భారత సైన్యం తీవ్రంగా స్పందించింది.

’ఇది అత్యంత హేయమైన ఘటన. ఉగ్రవాదులు భారత సైనికుడి దేహాన్ని ముక్కలు నరికి ఆ తర్వాత పీవోకేలోకి పారిపోయారు. సరిహద్దులకు ఆవల ఉన్న అధికారిక, అధికారేతర గ్రూపుల అనాగరిక చర్యకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. దీనికి తగినరీతిలో మేం బదులిస్తాం’ అని సైన్యం శనివారం స్పష్టం చేసింది.

ఇక సరిహద్దుల మీదుగా పాక్‌ సైన్యం యథేచ్ఛగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లుతుండటంతో తాజాగా మచిల్‌ సెక్టార్‌లో నితిన్‌ సుభాష్‌ అనే మరో బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రాణాలు విడిచారు. గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న పాక్‌ కాల్పుల్లో పలువురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement