'జబ్ తక్ రహేగా సమోసేమే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్మే లాలూ' అని ఒకప్పుడు సగర్వంగా చెప్పిన లాలూ.. ఇప్పుడు కటకటాల వెనక్కి చేరి బిత్తర చూపులు చూసుకుంటున్నారు.
'జబ్ తక్ రహేగా సమోసేమే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్మే లాలూ' అని ఒకప్పుడు సగర్వంగా చెప్పిన లాలూ.. ఇప్పుడు కటకటాల వెనక్కి చేరి బిత్తర చూపులు చూసుకుంటున్నారు. బీహార్ రోడ్లన్నింటినీ హేమమాలిని బుగ్గలంత నున్నగా చేస్తానన్న లాలూ.. చిప్పకూడు తింటున్నారు. పశువుల దాణా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించగానే.. లాలూ ప్రసాద్ బంగ్లాలో చీకట్లు అలముకున్నాయి. ఆయన అధికారిక నివాసమైన నెం.10 సర్క్యులర్ రోడ్డు భవనం సోమవారం నాడు పూర్తి ఖాళీగా కనిపించింది. మామూలుగా అయితే ఆ భవనం ఎప్పుడూ పార్టీ కార్యకర్తలు, లాలూ మద్దతుదారులతో నిండి ఉంటుంది. గతంలో లాలూ భార్య రబ్రీదేవి కూడా బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే.
లాలూజీని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తుందన్న ఆశతో.. సంబరాలు జరుపుకుందామని అక్కడకు ఉదయమే కొందరు కార్యకర్తలు చేరుకున్నా, కోర్టు నిర్ణయం వెలువడగానే ఒక్కసారి నిరాశగా వెళ్లిపోయారని లాలూ బంగ్లా వద్ద భద్రత కోసం నియమించిన ఓ పోలీసు అధికారి చెప్పారు. లాలూ కుటుంబ సభ్యులు బంగ్లా లోపల ఉండిపోగా, వారిని కనీసం పలకరించడానికి కూడా ఎవరూ రాలేదన్నారు.
పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా అదే పరిస్థితి. కోర్టు తీర్పు వెలువడగానే ఆర్జేడీ కార్యకర్తలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. కానీ అదేమీ జరగలేదు. ఆయనకు శిక్ష విధింపును అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. లాలూ ప్రసాద్ పేరు 1997లోనే దాణా స్కాంలో వెలుగులోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.