తెలుగు సభలకు విదేశీ కళ! | World Telugu Conferences in telangana | Sakshi
Sakshi News home page

తెలుగు సభలకు విదేశీ కళ!

Nov 23 2017 1:00 AM | Updated on Nov 23 2017 1:00 AM

World Telugu Conferences in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో విదేశీ ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన తెలుగు మహాసభల్లో స్థానిక, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు వారే పాల్గొనేవారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న సభలు కావడంతో ఈ సారి ప్రత్యేకత ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రవాస తెలంగాణ వారు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే ఈ సభలకు ప్రత్యేక గుర్తింపొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే విదేశాల్లో కూడా సభల సన్నాహక సమావేశాలు మొదలుపెట్టి అక్కడి తెలుగు, ముఖ్యంగా తెలంగాణ ప్రాతినిథ్యమున్న సంఘాలతో ప్రచారం జరిపిస్తున్నారు. ప్రవాస తెలంగాణ వారే కాకుండా విదేశీయులను కూడా రప్పిస్తే తెలంగాణ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే మారిషస్‌ దేశ ఉపాధ్యక్షుడు ఈ సభలకు హాజరుకానున్నట్లు తెలిపినట్లు సభల కోర్‌కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. తెలుగుపై మక్కువ ఉన్న విదేశీ ప్రతినిధులను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. వివిధ అధ్యయనాల కోసం తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలుగు భాషపై అభిమానం పెంచుకున్న వారిని గుర్తించి, వారికి ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు.

తెలంగాణ వైభవం ఉట్టిపడేలా వేదిక..
ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు నమూనాలు సిద్ధం చేసిన కోర్‌కమిటీ సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపారు. బతుకమ్మ, పాలపిట్ట, జమ్మిచెట్టు, కాకతీయ తోరణం, గోల్కొండ, తెలంగాణ వైతాళికుల రూపాలతో నమూనాలు రూపొందించారు. వేదిక స్థలం.. ప్రవేశ ద్వారాలు.. ప్రముఖుల స్థానాలు.. భోజనశాల.. ప్రాంగణం వంటివి ఉండాల్సిన స్థలాలను గుర్తించేందుకు మహా సభల కోర్‌కమిటీ సభ్యులు, అధికారులు ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించారు. 
 
తక్కువ ధరకే స్టార్‌ హోటల్‌ వసతి..
రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి ఉచిత రవాణ, భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. కోరిన వారికి తక్కువ ధరకే స్టార్‌హోటల్‌ బస కల్పించనున్నట్లు చెప్పారు. సాహిత్య అంశాలతో పాటు తెలుగు శాసనాలు, నాణేల ప్రదర్శన ఉంటుందని సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి చేయాల్సిన కృషి, నేటి అవసరాలకు తగ్గట్లు భాషను మలుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, స్పోర్ట్స్‌ అథారిటీ డైరెక్టర్‌ దినకర్‌బాబు, సాహిత్య అకాడమీ కార్యదర్శి నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్‌ హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement