ఉప పోరు.. ఎవరిది జోరు! | who will win in by-election? | Sakshi
Sakshi News home page

ఉప పోరు.. ఎవరిది జోరు!

Sep 15 2014 12:09 AM | Updated on Aug 14 2018 2:50 PM

మెదక్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సాక్షి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీలతోపాటు అన్ని వర్గాల వారు ఉప ఎన్నిక ఫలితంపై ఆసక్తిచూపుతున్నారు. ఓటింగ్ శాతం తగ్గడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఫలితం ఎలా ఉంటుందోనని విశ్లేషించుకునే పని లో నిమగ్నమయ్యాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపుపై నమ్మకంతో ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గటం ఆ పార్టీలను కొంత కలవరానికి గురిచేస్తోంది.

 పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్‌ను పరిశీలించటంతోపాటు, ఏయే ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందన్న దానిపై ఆయా పార్టీల నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేయటంతోపాటు భారీ మెజార్టీ దక్కుతుందన్న నమ్మకంతో ఉంది. మెదక్ ఉప ఎన్నిక బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న మంత్రి హరీష్‌రావు పోలింగ్ సరళిపై పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో చర్చించారు. ఏ డు నియోజకవర్గాల పరిధిలో తమకు ఎంతమేర ఓట్లు వ స్తాయి? మెజార్టీ ఎంత రావచ్చు? అనే అంశాలపై హరీష్‌రావు చర్చించినట్లు సమాచారం.

ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ పెరిగిందని మంత్రి ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజార్టీ దక్కటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్‌లలో ఓటింగ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జరిగినట్లు ఆ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తంగా తమ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

 కాంగ్రెస్, బీజేపీలో ఆశలు....
 మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సైతం విజయావకాశాలపై నమ్మకంతో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి విజయంపై ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసిరావటంతోపాటు కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్‌తో విజయం ఖాయమని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గమైన నర్సాపూర్‌లో మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు మంచిపట్టు ఉన్న సిద్దిపేటలో ఓట్లను బీజేపీ చీల్చటం, గజ్వేల్‌లో  గట్టిపోటీ ఇవ్వటం తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

మెదక్‌లో టీఆర్‌ఎస్‌తో సమానంగా కాంగ్రెస్‌కు ఓట్లు వస్తాయన్న ధీమా వ్యక్తమవుతోంది. బీజేపీ పార్టీ సైతం విజయావకాశాలపై నమ్మకంగా ఉంది. మోడీ ప్రభావం, జగ్గారెడ్డి ప్రభావంతో ఉప ఎన్నికలో బయటపడతామని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఉప ఎన్నిక ఓటింగ్ సరళిపై పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి జగ్గారెడ్డి, ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం.

సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్, సిద్దిపేటలో అనుకూలమైన ఓటింగ్ జరిగినట్లు బీజేపీ అంచనా వేస్తోంది. దీనికితోడు మోడీ ప్రభావంతో యువత, పట్టణ ఓటర్లు తమవైపు మొగ్గుచూపారని భావిస్తోంది. జగ్గారెడ్డి తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలో భారీ మెజార్టీ రావటం ఖాయమని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఎంపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

 ‘గీతం’లో కౌంటింగ్ ఏర్పాట్లు
 మెదక్ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల నుంచి ఓటింగ్ యంత్రాలు రుద్రారంలోని గీతం యూనివర్సిటీకి చేరుకున్నాయి. అఖిలపక్షం నాయకుల సమక్షంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా ఈవీఎం యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేశారు. కౌంటింగ్ జరగనున్న గీతం యూనివర్సిటీ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement