భగాయత్‌ 'బూమ్‌'లు..

Uppal Bhagayat Lands Are Facing A Real Boom - Sakshi

ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల వేలంలో మరో రికార్డు

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌ భూములు రియల్‌ బూమ్‌ను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్‌లోని ఓ ప్లాట్‌ ఆదివారం రికార్డుస్థాయిలో ధర పలికింది. 525 గజాలున్న ఓ ప్లాట్‌ను గజానికి ఏకంగా రూ.79,900 చెల్లించి ఓ బిడ్డర్‌ దక్కించుకున్నారు. తొలిరోజు శనివారం జరిగిన ఆన్‌లైన్‌ వేలంలో 166 గజాలున్న ఓ ప్లాట్‌ గజం ధర రూ.77,000 పలికితే.. రెండో రోజైన ఆదివారం దాన్ని అధిగమించి గజం రూ.2,900 అధికంగా అమ్ముడుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లుక్‌ఈస్ట్‌ అభివృద్ధితోపాటు మెట్రోకు ఆమడ దూరంలోనే ఈ లేఅవుట్‌ ఉండటం కూడా హెచ్‌ఎండీఏకు రెండు రోజుల్లోనే రూ.290.21 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కార్యదర్శి రామకిషన్, ఇంజనీరింగ్‌ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌ రెడ్డి, ప్లానింగ్‌ డైరెక్టర్‌ నరేంద్ర, ఎస్టేట్‌ ఆఫీసర్‌ గంగాధర్, సీఏవో శరత్‌చంద్ర తదితర అధికారులు ఆదివారం జరిగిన ఆన్‌లైన్‌ వేలాన్ని పర్యవేక్షించారు.
 
రెండోరోజూ.. అదే జోరు..
తొలిరోజు వేలంలో 52 ప్లాట్లకు రూ.155 కోట్ల ఆదాయం రాగా.. రెండోరోజు 41 ప్లాట్ల ద్వారా రూ.135.21 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు సాగిన తొలి సెషన్‌లో 23 ప్లాట్లకు బిడ్డర్లు హోరాహోరీగా పోటీపడ్డారు. రెండు రోడ్డులు ఉన్న ప్లాట్‌ నంబర్‌ 127 (525 గజాలు) అత్యధికంగా గజానికి రూ.79,900 పలికితే.. అత్యల్పంగా ఓ ప్లాట్‌ను గజం రూ.43,800కు బిడ్డర్‌ దక్కించుకున్నారు. ఈ సెషన్‌లో మొత్తంగా రూ.51.34 కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 వరకు జరిగిన రెండో సెషన్‌లో 22 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో 3 ప్లాట్లకు సింగిల్‌ బిడ్‌ దాఖలు కాగా.. ఒక ప్లాట్‌కు బిడ్‌ దాఖలు కాలేదు. దీంతో ఈ నాలుగింటిని మినహాయించి మిగిలిన 18 ప్లాట్లకుగాను రూ.83.87 కోట్ల ఆదాయం సమకూరింది. రెండో సెషన్‌లో అత్యధికంగా గజం ధర రూ.64,000 పలకగా.. అత్యల్పంగా రూ.30,200 ధర పలికింది.

ఇదే అత్యధికం..
ఈ ఏడాది ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో జరిగిన ఉప్పల్‌ భగాయత్‌ ఫేజ్‌–1 ఆన్‌లైన్‌ వేలంలో గజం ధర అత్యధికంగా రూ.73,900 పలికితే, ఈసారి ఆ ధరను మించిపోయింది. ఈసారి ఎంఎస్‌టీసీ ద్వారా జరుగుతున్న ఫేజ్‌–2 ఆన్‌లైన్‌ వేలం మొదటిరోజు గజం ధర అత్యధికంగా రూ.77 వేలు పలికింది. ఇక రెండోరోజు ఆ రెండింటి ధరను చెరిపేస్తూ గజం ఏకంగా రూ.79,900 పలికి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. అయితే హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు కావడంతోనే జనాలు బాగా ఆదరిస్తున్నారని, ఈ లేఅవుట్‌లో ప్లాట్లు తీసుకుంటే ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చనే భావనతో అధిక ధరలు నమోదయ్యాయని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు మూసీనది వెంట చేపట్టిన బ్యూటిఫికేషన్, మినీ శిల్పారామం కూడా ఈ ప్లాట్లు అధిక ధర పలికేందుకు మరో కారణమని లెక్కలు వేసుకుంటున్నారు. మూడో రోజు సోమవారం కూడా ఇదేస్థాయిలో ప్లాట్‌ లు అమ్ముడవుతాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top