మోదీ పాలనతోనే దేశం సుభిక్షం 

Under Modi Administration, Country Develops In All Sectors - Sakshi

మీరు ఆశీర్వదిస్తే పార్లమెంట్‌కు వెళ్తా

బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 

సాక్షి, కొత్తకోట : నరేంద్ర మోదీ పాలనతోనే దేశం సుభిక్షంగా ఉందని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపాలని కోరారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఆ పార్టీ నాయకులు డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమానికి డీకే అరుణ, పార్లమెంట్‌ సభ్యులు జితేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు శాంతికుమార్, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సహం నిండింది. బాణ సంచా కాల్చుతూ, డప్పులతో ఊరేగింపుగా భారీ ఎత్తున రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు ఎద్దుల రాజవర్దన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ మాట్లాడారు. 

ప్రజలు మోదీని కోరుకుంటున్నారు.. 
దేశంకోసం, దేశ ప్రజలకోసం, దేశ సమగ్రతకోసం మళ్లీ ప్రదానిగా నరేంద్రమోదీనే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. భారతదేశ ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్న నరేంద్రమోదీ గ్రామాల్లోని మహిళలు, వృద్దులు, నిరుద్యోగులు మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, రాష్ట్ర ప్రజలు  కేసీఆర్‌ను మొన్ననే  ముఖ్యమంత్రిని చేశారని, ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నేటికి అమలు కాలేదన్నారు.

16సీట్లతో కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో ఏమి చేస్తాడని ఆమె ప్రశ్నించారు. మరోసారి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని, ఆయన మాటలు నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆభ్యర్థులకు ఈ నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేదన్నారు.  

ఆశీర్వదించి లోక్‌సభకు పంపండి.. 
గత 25సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటా వాటి పరిష్కారనికి కృషి చేస్తున్నాని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల మధ్యనే ఉన్నానన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో తనను మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలిపించి లోక్‌సభకు పంపిస్తే పాలమూరులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించడం కొరకు తనవంతు కృషి చేస్తానన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని నేటికి పూర్తి చేయలేకపోయారన్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని ఈ సందర్భంగా ఆమె  విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే పాలమూరు ప్రాంతంపై వివక్షత చూపుతున్నారన్నారు. బీజేపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌.వెంకట్‌రెడ్డి, సాయిరాం, మాధవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మన్నెంయాదవ్, రాజేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, దాబ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top