కాంగ్రెస్‌ నేతల బుర్రలు పాడయ్యాయి | TRS has 50 per cent votes along with the mark of the truck | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల బుర్రలు పాడయ్యాయి

Jan 5 2019 2:23 AM | Updated on Sep 19 2019 8:44 PM

TRS has 50 per cent votes along with the mark of the truck - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నేతల బుర్రలు పాడయ్యాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రక్కు గుర్తుతో కలిపి టీఆర్‌ఎస్‌కు 50 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతటి అహంకారి మరొకరు లేరని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో ట్రక్కు గుర్తు, టక్కు టమార విద్యతో ఉత్తమ్‌ గెలిచారన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన చొప్పదండి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల కార్యకర్తల భేటీలో కేటీఆర్‌ ప్రసంగించారు. ‘2014 శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని ఆరు సీట్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఉద్యమ రోజుల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు కష్టపడి పని చేయడంతో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ మహామహులు మట్టికరిచారు.

హుజూర్‌నగర్‌లో ట్రక్కు గుర్తు, టక్కు టమార విద్యతో ఉత్తమ్‌ గెలిచారు. మోదీ, రాహుల్, చంద్రబాబు చివరికి ఆరోగ్యం బాగా లేకున్నా సోనియాగాంధీ వచ్చి మరీ ప్రచారం చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను బ్రహ్మాండంగా ఆదరించారు. చంద్రబాబు ఇచ్చిన రూ.500 కోట్లకు ఆశపడి టీడీపీకి కాంగ్రెస్‌ దాసోహమైంది. బీజేపీ వందకుపైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. సింహం సింగిల్‌గా వస్తుందన్నట్లు కేసీఆర్‌ గెలిచారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ నేతల బుర్రలు పాడయ్యాయి. పొన్నాల లక్ష్మయ్య మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కొంత మంది కాంగ్రెస్‌ నేతలు రిటైర్మెంట్‌ తీసుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు. ఓడిన చోటనే వెతుక్కోవాలన్నట్లుగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తలు పనిచేయాలి. ఉత్తమ్‌ అంతటి అహంకారి మరొకరు లేరు. ట్రక్కు గుర్తుతో కలిపి టీఆర్‌ఎస్‌కు 50 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల కోసం బూత్‌ స్థాయి కమిటీలను పటిష్టం చేసుకోవాలి.

పది ఇళ్లకో కార్యకర్తను నియమించుకోవాలి. వందమందికో కార్యకర్త ఉండాలి. సిరిసిల్లలో పటిష్టమైన బూత్‌ కమిటీలతోనే నా మెజారిటీ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేసే పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సమష్టిగా పనిచేసి వీలయినన్ని ఏకగ్రీవం చేయాలి. 3,400కుపైగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దే. తండాల్లో చాలాచోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండే పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్‌ను పటిష్టంగా మార్చి లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలి. కేసీఆర్‌ చొప్పదండి అల్లుడు. ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్‌ నేతలు అధికారం వస్తుందని కలలుగని మంత్రిపదవులు సైతం పంచు కున్నరు. ఉత్తమ్‌ నిశ్శబ్ద విప్లవం అంటే నేను శబ్ద విప్లవం అని చెప్పా. ప్రజలు శబ్ద విప్లవమంటే ఏంటో చూపించారు. అధికారం వచ్చిందనే గర్వం కార్యకర్తలకు పనికి రాదు. ప్రజలతో మమేకం కావాలి’ అని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement