ఆదిలాబాద్‌: మంత్రుల ఇలాకాలో... మూడు స్తంభాలాట 

Three Parties Competition In Adilabad Constituency - Sakshi

మరో విజయం కోసం ఐకే రెడ్డి, రామన్న ప్రయత్నం

హస్త’గతానికి శ్రమిస్తున్న మహేశ్వర్‌రెడ్డి, సుజాత 

పట్టణ ఓటర్లపై బీజేపీ అభ్యర్థుల ఆశ

ప్రభావం చూపబోతున్న ముస్లిం ఓటర్లు

సాక్షి , ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పూర్వ జిల్లా నుంచి నాలుగేళ్లు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన ఇద్దరు నేతలు ఈ ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి త్రిముఖ పోటీ ఎదుర్కొంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా బలంగా ఉండడంతో ఓటరు తీర్పు ఎటు మొగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చేసిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు మరోసారి తమను గెలిపిస్తాయనే ధీమాతో ఇద్దరు మంత్రులు ఉండగా... ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకతతో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు అండగా ఉంటారని ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గండ్రత్‌ సుజాత ఆశాభావంతో ఉన్నారు. ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ప్రభావంతో పట్టణ ఓటర్లతో పాటు గ్రామాల్లో సైతం ఈసారి బీజేపీని గెలిపించాలనే పట్టుదల ఓటర్లలో ఉందని ఆ పార్టీ నిర్మల్, ఆదిలాబాద్‌ అభ్యర్థులు సువర్ణారెడ్డి, పాయల్‌ శంకర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల ఇలాఖాల్లో మూడు పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లుగానే పాదయాత్రలు, బహిరంగసభలు నిర్వహిస్తూ ప్రజల ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తుండం గమనార్హం. 

నిర్మల్‌లో బీజేపీతో మారుతున్న సమీకరణలు
గత ఎన్నికల్లో బీఎస్‌పీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ తరువాత పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరి, రాష్ట్ర మంత్రిగా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా, టీడీపీ, బీజేపీ పొత్తులో పోటీ చేసిన తెలుగుదేశం కేవలం 4567 ఓట్లు మాత్రమే సాధించింది. ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్‌ సువర్ణారెడ్డి బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు తోడు బీజేపీ బరిలో నిలవడంతో ఇక్కడ అంచనాలు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. సువర్ణారెడ్డి డాక్టర్‌గా నిర్మల్‌ పట్టణంలో ప్రముఖురాలే కాక, మాజీ డిప్యూటీ స్పీకర్‌ భీంరెడ్డి కూతురు కావడం, గత కొంత కాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో ఓటుబ్యాంకు సమకూరినట్లయింది. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నిర్మల్‌ పట్టణంలో బీజేపీ అభిమానులు కూడా అధికంగానే ఉన్నారు. గ్రామాల్లో సైతం బీజేపీ, ఆరెస్సెస్, ఇతర సంస్థలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. దీంతో త్రిముఖ పోటీగా మారిన పరిణామం ఫలితాలపై పడే అవకాశం కనిపిస్తోంది. 

ఆదిలాబాద్‌లో మూడు ముక్కలాట
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్రత్‌ సుజాత కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటుబ్యాంకుతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక వర్గాల నుంచి వస్తున్న మద్ధతుతో విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి భార్గవ్‌ దేశ్‌పాండేతో కలిసి ఆమె చేస్తున్న ప్రచారానికి స్పందన లభిస్తోంది. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ సైతం ఇక్కడ గట్టిపోటీ ఇస్తున్నారు. పాయల్‌ శంకర్‌కు మద్ధతుగా బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ఆదిలాబాద్‌ రాగా, సుజాత కోసం వీహెచ్‌ వంటి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ వచ్చి రామన్నను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రిముఖ పోటీలో ముస్లిం మైనారిటీ ఓట్లు ఇక్కడ కూడా కీలకంగా మారాయి. 

మంత్రుల్లో సడలని ధీమా!
త్రిముఖ పోటీలో విజయం తమదేనని ఇద్దరు మంత్రులు ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానంలో కాంగ్రెస్‌ నిలిచింది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినా, తన స్థానం మారదని జోగు రామన్న విశ్వాసంతో ఉన్నారు. బీఎస్‌పీ బలం పెరిగితే మైనారిటీల ఓట్లు మూకుమ్మడిగా తనకే లాభిస్తాయని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నాయిు. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ రెండో స్థానం కోసమే పోటీపపడతాయని వారి ధీమా. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గండ్రత్‌ సుజాత, పాయల్‌ శంకర్‌ ఎవరి లెక్కల్లో వాళ్లున్నారు. ఇక నిర్మల్‌లో మైనారిటీ ఓట్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చీలినా, సంక్షేమ పథకాలు మంత్రి ఐకే రెడ్డికి విజయం అందిస్తాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెపుతున్నాయి. ఈసారి తన విజయం ఖాయమైందని, టీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపును ఆపలేరని కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

మైనారిటీ ఓటర్లు ఎటువైపు..?
నిర్మల్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీల పాత్ర గణనీయంగా ఉంది. ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో ఈ రెండు స్థానాల్లో ఓటర్లున్నారు. బీజేపీని వ్యతిరేకించే ముస్లిం మైనారిటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముస్లిం మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటైన మజ్లిస్‌ పార్టీ ఈ రెండు స్థానాల్లో పోటీలో లేదు. టీఆర్‌ఎస్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒప్పందం కారణంగా మజ్లిస్‌ పార్టీ ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కే మద్ధతు ప్రకటించింది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్వయంగా నిర్మల్‌ వచ్చి టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరగా, ఆదిలాబాద్‌లో కేసీఆర్‌ మైనారిటీలకు తాను అండగా ఉన్నట్లు చెప్పారు. అయితే నిర్మల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ముస్లింలతో మంచి సంబంధాలు ఉండడం గమనార్హం. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా, నిర్మల్‌లో ముస్లిం మైనారిటీలు తనకే అండగా ఉంటారని మహేశ్వర్‌రెడ్డి విశ్వాసంతో ఉన్నారు. ఆదిలాబాద్‌లో ముస్లిం మైనారిటీలు టీఆర్‌ఎస్‌కే బాహాటంగా మద్ధతు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మంత్రుల ఇలాఖాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.

ఆదలాబాద్‌ నియోజకవర్గం వార్తల కోసం...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top