అంత్యక్రియలకు వెళ్లి వస్తూ...ముగ్గురి మృత్యువాత | Three died in one family in road accident | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ...ముగ్గురి మృత్యువాత

May 8 2015 12:39 AM | Updated on Aug 30 2018 3:56 PM

అంత్యక్రియలకు వెళ్తున్న వారికి అదే అంతిమయాత్ర అవుతుందనుకోలేదు వారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వారిని కారు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది.

పెద్దాపూర్ వద్ద కారు - ఆటో ఢీకొనడంతో ఘటన
పోతిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు
పది నిమిషాలైతే గూటికి చేరేవారు
ఒకే కుటుంబంలో  ముగ్గురు మృతి
పోతిరెడ్డిపల్లిలో విషాదఛాయలు

 
సంగారెడ్డి క్రైం : అంత్యక్రియలకు వెళ్తున్న వారికి అదే అంతిమయాత్ర అవుతుందనుకోలేదు వారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వారిని కారు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కదిలించి వేసింది. బంధువు చివరి చూపు కోసం వెళ్లిన వారికి అదే చివరి రోజైంది.

సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేకిందర్ సావిత్రి (60) కుటుంబానికి చెందిన ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం మాదారంలో చనిపోగా అతడి అంత్యక్రియలకు రేకిందర్ సావిత్రమ్మ, ఆమె కుమారుడు రేకిందర్ జనార్దన్, రెండో కుమారుడు కోటయ్య భార్య సుజాతలతో పాటు మరో నలుగురు ఆటోలో బుధవారం ఉదయం బయలుదేరారు. కార్యక్రమం పూర్తిచేసుకుని సాయంత్రం వారు సంగారెడ్డికి తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద కారు ఢీకొనగా సావిత్రి, జనార్దన్, సుజాతలు మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్‌తో సహా మరో నలుగురు గాయపడ్డారు.

కాగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే వారు మృత్యువాత పడడంతో గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీవాసులంతా కన్నీరు పెట్టారు. మృతుడు జనార్దన్‌కు భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అనాథలైన పిల్లలు : రోడ్డు ప్రమాదంలో సుజాత మృతి చెందగా ఆమె భర్త కోటయ్య గత కొన్ని నెలల క్రితం ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి పిల్లలు సాయి, శ్రీకాంత్, శ్రుతిలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కొన్ని నెలల క్రితం తండ్రి కోటయ్యను కోల్పోయిన పిల్లలు తాజాగా తల్లి కూడా మరణించిందన్న విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించసాగారు. పిల్లల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దలంతా మృత్యువాత పడడంతో ఆ కుటుంబమంతా రోడ్డున పడింది.

Advertisement
 
Advertisement
Advertisement