మరణాన్ని జయించిన మానవత్వం | 7 Year Old Brain Dead Boy Gives New Life To Six People Through Organ Donation, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మరణాన్ని జయించిన మానవత్వం

Jul 7 2026 8:39 AM | Updated on Jul 7 2026 10:23 AM

7 Year Old Gives New Life to Five After Death

రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి బ్రెయిన్‌డెడ్‌

 అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ

విషాదంలోనూ ఆదర్శ నిర్ణయం  

గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్‌ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడు. ఇంత విషాదంలోనూ ఆ కుటుంబ సభ్యులు  బాలుడి అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించారు. 

బాలుడు తను వెళ్లిపోతూ ఆరుగురి రూపంలో ఈ లోకంలోనే ఉండిపోయాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బొంబాయి పాపారావు కూతురు సౌమ్య, అల్లుడు రఘు ఉద్యోగరీత్య తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా రాధాపురంలో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు యశ్వన్‌(7) గత నెల 29న సైకిల్‌ తొక్కుకుంటూ ఉండగా అతివేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలై బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయారు. ఇంత విషాదంలో యశ్వన్‌ తల్లిదండ్రులు, తాత పాపారావు బాలుడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కంటి పాపలను ఇతరులకు మార్పిడి చేశారు. ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన యశ్వన్‌ తన మరణానంతరం చిరంజీవిగా నిలిచిపోయాడు. చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపోయిన యశ్వన్‌ భౌతికంగా లేకపోయినా అతని గుండెచప్పుడు, చూపు, జీవం మరో ఆరుగురిలో కొనసాగుతోంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement