breaking news
brain-dead boy
-
మరణాన్ని జయించిన మానవత్వం
గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఇంత విషాదంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాలుడి అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించారు. బాలుడు తను వెళ్లిపోతూ ఆరుగురి రూపంలో ఈ లోకంలోనే ఉండిపోయాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బొంబాయి పాపారావు కూతురు సౌమ్య, అల్లుడు రఘు ఉద్యోగరీత్య తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా రాధాపురంలో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు యశ్వన్(7) గత నెల 29న సైకిల్ తొక్కుకుంటూ ఉండగా అతివేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలై బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయారు. ఇంత విషాదంలో యశ్వన్ తల్లిదండ్రులు, తాత పాపారావు బాలుడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కంటి పాపలను ఇతరులకు మార్పిడి చేశారు. ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన యశ్వన్ తన మరణానంతరం చిరంజీవిగా నిలిచిపోయాడు. చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపోయిన యశ్వన్ భౌతికంగా లేకపోయినా అతని గుండెచప్పుడు, చూపు, జీవం మరో ఆరుగురిలో కొనసాగుతోంది. -
మహిళ ప్రాణాలు నిలబెట్టిన బాలుడు
కొచ్చి: తాను చనిపోతూ ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడో కేరళ టీనేజర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 15 ఏళ్ల విశాల్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతడి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అతడి గుండెను 27 ఏళ్ల మహిళకు దానం చేశారు. విశాల్ దేహం నుంచి వేరు చేసిన గుండెను తిరువనంతపురం నుంచి నావికాదళానికి చెందిన ఎయిర్ అంబులెన్స్ లో బుధవారం కొచ్చిలోని లీసీ ఆస్పత్రికి తరలించారు. అరుదైన గుండె జబ్బుతో బాధ పడుతున్న త్రిశూర్ కు చెందిన సంధ్య అనే మహిళకు వైద్యులు 5 గంటల పాటు ఆపరేషన్ చేసి దీన్ని అమర్చారు. ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు. తిరువనంతపురంలోని ముక్కోల ప్రాంతానికి చెందిన విశాల్ స్కూల్ కు వెళుతుండగా జూలై 16న ప్రమాదానికి గురైయ్యాడు. వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. అతడు బెయిన్ డెడ్ అయినట్టు తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు ధ్రువీకరించారు. 'మృతసంజీవని' అధికారుల చొరవతో విశాల్ అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అతడి గుండెను కొచ్చికి తరలించగా, మూత్రపిండాలను ఇద్దరు రోగులకు దానం చేశారు.


