నిద్రలోనే తుది శ్వాస విడిచిన బాలిక | The girl left the final breath sleep | Sakshi
Sakshi News home page

నిద్రలోనే తుది శ్వాస విడిచిన బాలిక

Oct 13 2015 2:41 AM | Updated on Sep 28 2018 3:41 PM

అప్పటి వరకు బాగానే ఉన్న ఓ నిరుపేద బాలిక నిద్రలోనే అకస్మాత్తుగా తుది శ్వాస విడిచిన సంఘటన మండల పరిధిలోని అందె గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.

మిరుదొడ్డి: అప్పటి వరకు బాగానే ఉన్న ఓ నిరుపేద బాలిక నిద్రలోనే అకస్మాత్తుగా తుది శ్వాస విడిచిన సంఘటన మండల పరిధిలోని అందె గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మాదర బోయిన కవిత (16), శ్రీనివాస్ అన్నా చెల్లెలు. వీరి తల్లిదండ్రులు గౌరవ్వ, సత్తయ్యలు  మూడేళ్ల కాలంలోనే ఒకరి తర్వాత మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అన్నా చెల్లెలు అనాథలుగా మారారు. రెక్కాడితే గానీ డొక్కలు నిండని పరిస్థితుల్లో కవిత పదవ తరగతి చదువును మధ్యలోనే ఆపేసింది.

దీంతో అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ కూలీ నాలీ చేస్తూ జీవనం గడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం రోజున వ్యవసాయ కూలీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి వంటా వార్పు చేసింది. తన అన్న శ్రీనివాస్‌తో కలిసి రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయారు. సోమవారం ఉదయం తన చెల్లి నిద్ర నుంచి లే పడానికి ప్రయత్నించడంతో కవిత ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. కంగారు పడ్డ శ్రీనివాస్ చుట్టు పక్కల వారికి తెలియజేశాడు.

నిద్రలోనే కవిత చనిపోయినట్లు నిర్ధారించారు. మూడేళ్ళ కాలంలో తల్లిదండ్రులను, ఉన్న ఒక్క చెల్లెల్ని పోగొట్టుకున్న శ్రీనివాస్ కన్నీరు మున్నీరయ్యాడు. అందరితో కలుపుగోలుగా ఉండే కవిత మృతి చెందిందన్న విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు కన్నీళ్ళ పర్యంతమయ్యారు. గ్రామస్తులు చందాలు పోగు చేసుకుని కవిత అంత్యక్రియలు చేశారు. కుటుంబంలో అందరినీ పోగొట్టుకుని ఉండడానికి పెంకుటిల్లు తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేని అనాథగా మిగిలిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు ఆదుకోవాలని ఎంపీటీసీ జక్కిరెడ్డి సోమేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement