టీఆర్‌ఎస్‌లోకి తెలుగు తమ్ముళ్లు?

టీఆర్‌ఎస్‌లోకి తెలుగు తమ్ముళ్లు? - Sakshi


కేటీఆర్‌తో తలసాని సహా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సంప్రదింపులు

 

శ్రావణమాసంలో ముహూర్తం!

అనర్హత వేటుకు అందకుండా ప్రణాళిక


 

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను సాకుగా చూపుతూ.. ఈ ఎమ్మెల్యేలు ఆషాఢమాసం తరువాత శ్రావణమాసం తొలివారంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ టీడీపీ ఫ్లోర్‌లీడర్ పదవిని ఆశించి భంగపడ్డ హైదరాబాద్ జిల్లా  టీడీపీ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ మారే బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనతోపాటు  గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌లతోపాటు మహబూబ్‌నగర్ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరితో కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



రేవంత్‌రెడ్డి పార్టీ మారే విషయాన్ని కొట్టిపారేస్తున్నా.. భవిష్యత్ రాజకీయ అవసరాల నేపథ్యంలో కార్యకర్తల ఒత్తిడి పేరుతో గులాబీ కండువా కప్పుకునేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం. ఏపీ సీఎంగా చంద్రబాబు విద్యుత్, పోలవరం, సాగునీరు, గవర్నర్‌కు కీలకాధికారాల అంశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుందని, ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉంటే రాజకీయంగా ఆత్మహత్యేనని వీరంతా భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలను  అనర్హత వేటుకు అందకుండా.. టీఆర్‌ఎస్‌లో చేర్చేందుకు కేటీఆర్ పావులు కదిపారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top