10వ షెడ్యూల్‌పై ఏపీతో అమీతుమీ! | telangana wants more clarity on tenth schedule with andhra pradesh | Sakshi
Sakshi News home page

10వ షెడ్యూల్‌పై ఏపీతో అమీతుమీ!

Feb 12 2015 2:33 AM | Updated on Apr 7 2019 3:35 PM

విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విషయంలో ఏపీతో అమీతుమీ తేల్చుకోడానికి టీ సర్కార్ సిద్ధమైంది.

- ఆ షెడ్యూల్లోని సంస్థలు తెలంగాణలో ఉంటే అవి మావే
- జోక్యం చేసుకోకుండా ఏపీని ఆదేశించాలని హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్
- ధర్మాసనానికి నివేదించిన సింగిల్ జడ్జి
- ఏపీ విద్యామండలి బ్యాంకు కేసు కూడా ధర్మాసనానికే


హైదరాబాద్: విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విషయంలో ఏపీతో అమీతుమీ తేల్చుకోడానికి టీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉంటే వాటిపై పూర్తి హక్కులు తమవేనని, వాటి విషయంలో జోక్యం చేసుకోకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ధర్మాసనానికి నివేదిస్తూ న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఏపీ ఉన్నత విద్యామండలికి చెంది న బ్యాంక్ ఖాతా నిలిపివేత కేసును కూడా ధర్మాసనానికి నివేదిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ కూడా బుధవారం విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేఖ ఆధారంగా తమ బ్యాంకు ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) శాంతినగర్ శాఖ నిలిపివేయడాన్ని (ఫ్రీజ్) సవాలు చేస్తూ ఏపీ మండలి హైకోర్టులో పిటిషన్ వేయడం, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీ మండలిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11కు జస్టిస్ భట్టీ వాయిదా వేయడం తెలిసిందే. బుధవారం వ్యాజ్యం విచారణకు రాగానే... అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తన వాదన వినిపించారు.  

ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ అభిప్రాయం కోరిన జస్టిస్ భట్టీ, ఆయన అభ్యంతరం చెప్పకపోవడంతో వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులిచ్చారు. అనంతరం 10వ షెడ్యూల్లోని సంస్థల హక్కులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్ విలాస్ పుర్కర్ ముందుకొచ్చింది. ఏపీ మండలి పిటిషన్‌ను జస్టిస్ భట్టీ ధర్మాసనానికి నివేదించారని న్యాయమూర్తికి ఏజీ రామకృష్ణారెడ్డి వివరించారు. దాంతో ఈ వ్యాజ్యాన్ని కూడా ధర్మాసనానికే జస్టిస్ పుర్కర్ నివేదించారు.

Advertisement
 
Advertisement
Advertisement