హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Again appeals to people to Stay at Home  - Sakshi

ఇప్పటి వరకు తెలంగాణాలో  563 కేసులు, 17మంది మృతి

ఒక్క హైదరాబాద్‌లోనే 126 కంటైన్మెంట్లు

నగరాన్ని జోన్ల వారీగా విభజించి ప్రత్యేక అధికారుల నియామకం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సోకినవారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున హైదరాబాద్‌ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దొన్ని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగించారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సీఎంకు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. (వైరస్ వ్యాప్తి ఆగట్లేదు)

అలాగే హైదరాబాద్‌తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్‌డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను ముఖ్యమంత్రి సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్‌ నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. 

‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా సోకే అవకాశాలు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకో డీఎంఅండ్హెచ్ఓ ఉన్నారు. 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలి’’ అని కేసీఆర్‌ చెప్పారు. 

‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top