వైరస్‌ వ్యాప్తి ఆగట్లేదు

KCR Review Meeting Over Coronavirus Pandemic - Sakshi

రాష్ట్రంలో, దేశంలో తీవ్రత పెరిగింది

‘కరోనా’పై సమీక్షలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలిందని, దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 531కి చేరిందని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్‌ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంటల కొనుగోళ్లు జరుగుతున్న విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9.30 వరకు సాగిన సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని ఆయన సమీక్షించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదని స్పష్టమవుతోంది.

ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 28కి పాజిటివ్‌ అని తేలడంతో పాటు ఇద్దరు చనిపోయారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి భయంకరంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగాయి. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలి. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలు దానికి సహకరించాలి. కరోనా వ్యాప్తి నివారణ కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోనే సాధ్యం కాదు. వాటిని ప్రజలు తు.చ. తప్పకుండా పాటించినప్పుడు అది సాధ్యమవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతుందనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందు కంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

అధికారులు అప్రమత్తంగా ఉండాలి... 
కరోనా వ్యాప్తి నివారణ విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎవరికి లక్షణాలు కన్పించినా పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేశారు. ‘‘పాజిటివ్‌ వచ్చినవారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి, వారికీ పరీక్షలు నిర్వహించాలి. అంతర్రాష్ట్ర సరి హద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలి. నియం త్రణ పెంచాలి. మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించి, పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతోంది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఇవి వారి కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చెబుతున్న మాటలు. ప్రజల నిరంతర అప్రమత్తత, ఇళ్లకే పరిమితం కావడంతోనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుంది’’అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభు త్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణరావు, జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top