దమ్ముంటే మళ్లీ గెలిచి చూపించండి : భట్టి | TCLP Leader Fired on CM KCR | Sakshi
Sakshi News home page

దమ్ముంటే మళ్లీ గెలిచి చూపించండి : భట్టి

Jun 13 2019 3:19 PM | Updated on Jun 13 2019 7:21 PM

TCLP Leader Fired on CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి ప్రయత్నించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోంది. నా నిరాహార దీక్షకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాను. నా పోరాటం ఆరంభం మాత్రమే. నేనూ, మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటాం. పొలిటికల్ మాఫియా, టెర్రరిస్టులు ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ఈ మాఫియాను ముందుండి నడిపిస్తున్నారు. కేసీఆర్ పుట్టలో దాక్కుని ఫిరాయింపులపై మాట్లాడిస్తున్నారు. కేసీఆర్‌కు ఏమాత్రం దమ్మూధైర్యం ఉన్నా.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని భట్టీ గురువారం విలేకరులతో అన్నారు. 

‘కేసీఆర్‌ను పుట్టలోనుంచి బయటకు ఎలా రప్పించాలో మాకు తెలుసు. ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడింది వాస్తవం కాదా? ఫిరాయింపులకు సంబంధించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను పూర్తిగా విస్మరిస్తున్నావు. దీనిపై కేసీఆర్ ఎక్కడ చర్చ పెట్టినా నేను రావడానికి సిద్ధం. ఈ పొలిటికల్ మాఫియాను అడ్డుకోకపోతే  ప్రజల ఓటుకు విలువ పోతుంది. ఈ ఫిరాయింపులను ఆపకపోతే భవిష్యత్‌లో డబ్బు ఉన్న వాళ్లంతా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుక్కొని సీఎంలు, పీఎంలు అవుతారు. 

కొద్దిరోజుల్లో వివిధ వర్గాల మేధావులతో ఫిరాయింపులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. కాంగ్రెస్‌కు నాయకత్వం లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికలకు  ముందు ఇప్పుడు ఒకే నాయకులు ఉన్నారు. మరి ఎన్నికలకు ముందు ఎందుకు పార్టీ నుంచి వెళ్ళలేదు? అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతామంటున్నారు. టీఆర్ఎస్‌కు చెందని ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరా? నేను సవాల్ విసురుతున్న పార్టీ మారిన వారంతా రాజీనామా చేయడండి. దమ్ముంటే మళ్ళీ ఎన్నికల్లో గెలిచి చూపించండి’ అని భట్టి విక్రమార్క అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement