ఆటాడుకుందాం.. రా!

T20 Cricket Matches With City Police vs City Youth - Sakshi

హైదరాబాద్‌ పోలీస్‌ లీగ్‌ నిర్వహణకు నిర్ణయం

80 వేల మంది యువత భాగస్వామ్యమే లక్ష్యం

మహిళల కోసం ప్రత్యేక టీమ్‌లు సీపీ అంజనీకుమార్‌ వెల్లడి

సాక్షి,సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాలను అవలంభిస్తున్న నగర పోలీసు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. యువతతో సత్సంబంధాలు నెలకొనే విధంగా వారిని భాగస్వాములను చేస్తూ క్రికెట్‌ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటిని ‘హైదరాబాద్‌ పోలీసు లీగ్‌ (హెచ్‌పీఎల్‌) 20–20’ మ్యాచెస్‌గా పిలువనున్నట్లు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మంగళవారం ప్రకటించారు. నగర వ్యాప్తంగా జరిగే ఈ పోటీల్లో 80 వేల మంది యువతను పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి టీమ్‌కు ప్రత్యేక రంగుతో కూడిన, తమ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా డ్రస్‌ ఉంటుందని ఆయన వివరించారు. పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అనేక సెక్టార్లు ఉంటాయి. ఒక్కో సెక్టార్‌కు ఒక ఎస్సై నేతృత్వం వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సెక్టార్ల వారీగా టీమ్‌లు తయారు చేసి ఈ పోటీలు నిర్వహించాలని సీపీ నిర్ణయించారు. ఇక్కడ గెలిచిన జట్లు ఠాణా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటాయి. ఆపై సబ్‌–డివిజన్, జోనల్‌ స్థాయిల్లోనూ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఫైనల్‌ మ్యాచ్‌ను మాత్రం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి మ్యాచ్‌ సౌత్‌ జోన్‌కు సంబంధించి ఈ నెల 21న బార్కస్‌ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఆసక్తిగల యువకులు, క్రీడాకారులు తమ సెక్టార్‌ ఎస్సై, లేదా స్థానిక ఠాణా ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణతో కలిసి నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లలో పాల్గొనాలంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు నగరానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లకు కొత్వాల్‌ పిలుపునిచ్చారు.  అందరూ భాగస్వాములైతే యువతకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. మహిళా క్రీడాకారిణుల కోసం ప్రత్యేకంగా టీమ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం దీని ప్రభావం క్రీడాకారులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.  ఈ నేపథ్యంలోనే ప్రతి మ్యాచ్‌ను తెల్లవారుజామునే ప్రారంభించి ఉదయం 10.30 గంటల్లోగా పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హెచ్‌పీఎల్‌ సిరీస్‌ ముగిసిన తర్వాత ఎక్కువ రన్‌లు చేసిన, వికెట్లు తీసిన, బెస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌.. ఇలా మొత్తం 10 కేటగిరీలో వ్యక్తిగత అవార్డులు సైతం ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌లో నగర యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీపీ కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top