రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్‌కు పట్టింపేదీ..

Sampath Kumar Serious Comments On KTR At Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్యలు, ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఓ వైపు దేశం ఆగమవుతుంటే బీజేపీ నేత అమిత్ షా అయోధ్య గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్ యాదాద్రిలో పాపాలను కడిగేసుకోవడానికే దేవుడి దగ్గరకు పోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐకియా సంస్థకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్‌ ప్రో కో జరిగిందని ఆరోపించారు. హెరిటేజ్‌ భవనాన్ని తొలగించి కేటీఆర్‌ అక్కడ వందల కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పించారు.

ఇక టీఆర్‌ఎస్‌ నేతలు హరీష్‌ రావు, కేటీఆర్‌లను వారితో ఉన్న స్నేహ సంబంధాల కారణంగానే చింటూ పింటూ అని పిలిచానని సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎలాంటి బూతులు మాట్లాడకుండా కేవలం ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే విమర్శించానన్నారు. కానీ వాళ్లు దీనికి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెలిపారు. ‘నాకు గన్‌మెన్లను తీసేశారు. మా అన్నను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తొలగించారు. నా తమ్ముడికి న్యాయపరంగా వచ్చిన మున్సిపాలిటీ కాంట్రాక్ట్‌లను తొలగించారు. నాతోపాటు మాజీ ఎమ్మెల్యేలందరికీ ఏడాదికి పైగా రావాల్సిన పెన్షన్లను ఆపేశారు. తనపై కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.  నాపై కక్ష సాధిస్తే నేను ప్రశ్నించకుండా ఉంటాననుకుంటే అది మూర్ఖత్వం. ఎన్ని చేసినా నీపై పోరాటాలు ఆపే ప్రసక్తి లేదు. ఖబడ్దార్, నీపొగరు దిగే వరకు మా పోరాటాలు ఉంటాయి’ అని  సంపత్‌ కుమార్‌ తెలిపారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top