కదం తొక్కిన ‘ఉపాధి’ సిబ్బంది | Protest of Upadhihami staff | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన ‘ఉపాధి’ సిబ్బంది

Jul 9 2015 11:35 PM | Updated on Mar 18 2019 8:51 PM

కదం తొక్కిన ‘ఉపాధి’ సిబ్బంది - Sakshi

కదం తొక్కిన ‘ఉపాధి’ సిబ్బంది

ఉపాధిహామీ సిబ్బంది సమస్యల పరి ష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా గురువారం వందలాది మంది సిబ్బంది కదం తొక్కారు.

చేవెళ్ల : ఉపాధిహామీ సిబ్బంది సమస్యల పరి ష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా గురువారం వందలాది మంది సిబ్బంది కదం తొక్కారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్లలో భారీ ర్యాలీ నిర్వహించి, హైదరాబాద్-బీజాపూర్ రాష్ట్రీయ రహదారిపై గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారంకోసం 24 రోజులుగా గ్రామీణాభివృద్ధిశాఖ, ఉపాధిహామీ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో బుధవారం నవాబుపేట మండలం యావాపూర్ గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల రాంచంద్రయ్య పాల్గొన్నారు.

తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారో లేదోననే బెంగతో ఆయన అదేరోజు రాత్రి గుండె ఆగి మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఉపాధిహామీ సిబ్బంది రాంచంద్రయ్య మృతదేహాన్ని చేవెళ్ల ఆర్డీఓ ఆఫీసుకు తరలించి నిరసన తెలపాలని భావించి కాంగ్రెస్‌పార్టీ మద్దతు కోరారు.  యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి గురువారం చేవెళ్లకు వచ్చారు. ఎస్పీ శ్రీనివాసులుతో ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాన్ని చేవెళ్లకు తీసుకువచ్చేందుకు అనుమతించాలని, కొద్దిసేపు శాంతి యుతంగా నిరసన తెలుపుతామని కోరారు. ఎస్పీ అనుమతి నిరాకరించడంతో కార్తీక్‌రెడ్డి అప్పటికే అక్కడ గుమిగూడిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఉపాధిహామీ సిబ్బందితో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు.

అక్కడికి చేరుకున్న ఆర్డీఓ చంద్రమోహన్ వారికి నచ్చజెప్పారు. మృతుని కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం ఇస్తామని రాతపూర్వక హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో చేసేది లేక ఆర్డీఓ వెనుదిరి గారు. అప్పటికే రాస్తారోకో చేపట్టి గంటకుపైగా కావడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు కార్తీక్‌రెడ్డితో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు పి.గోపాల్‌రెడ్డి, జంగం శివానందం, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు జి.రవికాంత్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఎండీ.అలీ, ప్రభాకర్ తదితరులను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన ఉపాధిహామీ సిబ్బందిని కూడా అరెస్టుచేసి అనంతరం సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీశైలం, నాయకులు మాధవరెడ్డి, మాధవగౌడ్, బాలయ్య, ఉపాధిహామీ జేఏసీ నాయకులు రాజశేఖర్, నాగభూషణం, రవీందర్‌రెడ్డి, తిరుపతాచారి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement