టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ మహిళా నేత | Prior to joining the General Women's | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ మహిళా నేత

Mar 13 2014 2:50 AM | Updated on Sep 2 2017 4:38 AM

తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి బుధవారం హైదారాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

 తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి బుధవారం హైదారాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కొన్ని రోజులుగా డోలాయమానంలో ఉన్న ప్రేమలతారెడ్డి.. ఎట్టకేలకు టీడీపీని వీడారు. గతంలో ఆమె టీడీపీ హయాంలో రెండు సార్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, చిటకోడూరు ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు.

ప్రస్తుతం ఆమె చిటకోడూరు పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్నారు. కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ప్రేమలతారెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పలుమార్లు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా ప్రేమలతారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో ఉండేందుకే టీఆర్‌ఎస్ గూటికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె వెంట జనగామ టీడీపీ నేతలు నారోజు రామేశ్వరాచారి, మధుసూదన్, రాందయాకర్, బాలనర్సయ్య, బాల్నె సోమయ్య, పోటె శ్రీనివాస్, మేకల భాగ్యమ్మ, రాంరెడ్డి, మల్లేషం కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇదిలాఉండగా ప్రేమలతారెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి సరిగా స్పందించకపోవడంతో ఆమె పార్టీని వీడినట్టు శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

 కేయూ జేఏసీ నేతలు టీఆర్‌ఎస్‌లోకి..
 

వరంగల్ : రెండు రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసి ఈ ఎన్నికల్లో తమకు రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరిన కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకుల్లో వీరెందర్, చిర్ర రాజు టీఆర్‌ఎస్‌లో చేరారు. విద్యార్థి నాయకులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు యత్నిస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, జిల్లా ఇంచార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బక్కనాగరాజు, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, యాకూబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement