‘టీఆర్‌ఎస్‌’ పేరు వివాదంపై కవితకు ఊరట | Delhi High Court grants relief to Kalvakuntla Kavitha in party name allocation case | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌’ పేరు వివాదంపై కవితకు ఊరట

Jul 8 2026 1:35 AM | Updated on Jul 8 2026 2:38 AM

Delhi High Court grants relief to Kalvakuntla Kavitha in party name allocation case

ఈసీ ఏకపక్ష తీరుపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ పేరు కేటాయింపు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఏకపక్షంగా జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం విచారించింది. కవిత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వ్యక్తిగత విచారణ జరిపిన తర్వాతే పేరు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి చట్టప్రకారం సవివరమైన ఉత్తర్వులు (స్పీకింగ్‌ ఆర్డర్‌) జారీ చేయాలని స్పష్టం చేసింది. 

కవిత కొత్త పార్టీ పేరుపై దాదాపు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని, ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు సూచించాలని కోరుతూ మే 12, జూన్‌ 23 తేదీల్లో ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌కు అభ్యంతరాల కాపీలు ఎందుకు ఇవ్వలేదని ఈసీని నిలదీసింది. 

నిబంధనల ప్రకారం వారికి వ్యక్తిగత విచారణ అవకాశం ఎందుకు కల్పించలేదని ఈసీ న్యాయవాదిని ప్రశ్నించింది. నోటీసులకు సంబంధించి కవిత తన లిఖితపూర్వక వివరణను వారం రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలని సూచించింది. ఆ వివరణను పరిశీలించి, పిటిషనర్‌ ప్రతినిధులకు వ్యక్తిగతంగా వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం కల్పించాలని ఈసీని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement