కవిత పార్టీ కొత్త పేరు ‘తెలంగాణ రక్షణ సేన’ | ECI approves TRS as name of Kavitha new party | Sakshi
Sakshi News home page

కవిత పార్టీ కొత్త పేరు ‘తెలంగాణ రక్షణ సేన’

May 1 2026 1:23 AM | Updated on May 1 2026 1:23 AM

ECI approves TRS as name of Kavitha new party

రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం 

పత్రికల్లో పబ్లిక్‌ నోటీసు, అభ్యంతరాల స్వీకరణకు 

నెల గడువు ఏప్రిల్‌ 25న ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా అవతరణ 

అభ్యంతరం తెలిపిన ‘తెలంగాణ రాజ్యాధికార సమితి’ 

‘టీఆర్‌ఎస్‌ నాకు రాసిపెట్టి ఉందేమో’ అని కవిత పోస్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’ పేరిట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పచ్చజెండా ఊపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 29ఎ కింద పార్టీ నమోదు కోసం దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన ఈసీ.. నిబంధనల ప్రకారం పత్రికల్లో పబ్లిక్‌ నోటీసు జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 28న కవితకు ఈసీ అధికారిక లేఖ పంపింది. బంజారాహిల్స్‌ చిరునామాతో ఉన్న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏప్రిల్‌ 23న కవిత ఈసీకి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం.. దరఖాస్తులో ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై బహిరంగ ప్రకటన ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

పార్టీ రిజిస్ట్రేషన్‌ నిబంధనల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రంలో రెండు జాతీయ, రెండు స్థానిక దినపత్రికల్లో పార్టీ పేరును తెలుపుతూ వరుసగా రెండు రోజులపాటు పబ్లిక్‌ నోటీసు ప్రచురించాలి. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రకటన ప్రచురించిన నాటి నుంచి 30 రోజుల వ్యవధిలో తెలపాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి. అభ్యంతరాలను సాధారణ కాగితంపై రాసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ (పొలిటికల్‌ పార్టీ)కి పోస్టు ద్వారా లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ–మెయిల్‌ ద్వారా పంపవచ్చని ప్రజలకు తెలియజేయాలి.

పబ్లిక్‌ నోటీసుపై వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ పేరుకు ఈసీ తుది ఆమోదం తెలుపుతుంది. ఈసీ ఆమోదించిన పేరిట పార్టీ రాజ్యాంగాన్ని, నిబంధనలను పొందుపరుస్తూ అనుబంధం–1లో తాజా దరఖాస్తును దాఖలు చేయాలని లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఈ పత్రాలు అందిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంటుంది.

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట దరఖాస్తు
కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అధ్యక్షురాలి హోదాలో కవిత కొత్త పార్టీ పేరు కోసం అనుమతి కోరుతూ ఐదు పేర్లు ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను ప్రతిపాదించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రత్యుత్తరాలు నడుస్తున్నా కొత్త పార్టీ పేరుపై స్పష్టత రాకపోవడంతో ఈ నెల 25న జరిగిన ఆవిర్భావ సమావేశంలో కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ పూర్వపు పేరు టీఆర్‌ఎస్‌ను పోలిఉండేలా కవిత ఈ పేరును ప్రకటించారు. ఇదిలా ఉంటే ‘ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఐదు పేర్లతో దరఖాస్తు చేస్తే మూడో ప్రాధాన్యతగా ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్‌)కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాకు రాసి పెట్టి ఉందేమో’ అని కవిత గురువారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

‘తెలంగాణ రాజ్యాధికార సమితి’ అభ్యంతరం
టీఆర్‌ఎస్‌ సంక్షిప్త నామంతో ఇప్పటికే తమ పార్టీ ఉన్నందున అదే అక్షరాలను పోలి ఉండే కొత్త పార్టీని రిజిస్టర్‌ చేయొద్దని తెలంగాణ రాజ్యాధికార సమితి అధ్యక్షులు తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇలాఉండగా, తిరిగి టీఆర్‌ఎస్‌గా పార్టీ పేరు మార్చుకుంటామని ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంచిర్యాలలో జరిగిన మీడియా భేటీలో వెల్లడించారు. నెల రోజుల్లోగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగుతుందని కవితకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్‌ఎస్‌’ సంక్షిప్త నామంపై పరస్పర ఆరోపణల పర్వం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement