సాక్షి, యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కవిత సింగిల్‌గా పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్‌ను కవిత తిట్టడం బాధగా ఉంది. ఒక ఉద్యమకారుడి బిడ్డ అనే తనకు గుర్తు ఉంది. తండ్రి అంటే కూతురికి ప్రేమ ఉండాలి. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడంతో తను మర్యాద పోగొట్టుకుంది. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు.
మద్యం కుంభకోణంలో తనకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు.. కేసు పూర్తి కాలేదు. టీఆర్‌ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదం. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం పాన్ షాపు పెట్టినంత సులువు అయిపోయింది. పార్టీ కాదు తను సొంతంగా పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ అధిష్టానం నాకు హామీ ఇచ్చింది.. నాకు పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తా’ అని తెలిపారు.


