సడలింపు దారి తప్పుతోంది... | People Neglect on Lockdown in Hyderabad | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు గుంపుల పోటు.. లాక్‌డౌన్‌ ఆంక్షలకు తూటు

Mar 26 2020 7:40 AM | Updated on Mar 26 2020 8:30 AM

People Neglect on Lockdown in Hyderabad - Sakshi

బేగంపేట ప్రధాన రహదారిలో అటుగా వస్తున్న ఓ వాహనదారున్ని ఆపి వివరాలు అడుగుతున్న పోలీసులు

పెద్ద మార్కెట్లలో పట్టింపులేని సోషల్‌ డిస్టెన్స్‌ ఎటు చూసినా ఆందోళనకర పరిస్థితులు.. ఎక్కడ విన్నా కోవిడ్‌ మహమ్మారిపై చర్చలు..ఏ ఒక్కరినీ కదిలించినా కరోనా వైరస్‌ గురించే మాటలు. ఈ వ్యాధి కట్టడికి దేశమంతా మరో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో ఎవరూ ఇళ్లలోంచి కదలలేదు. ఇంటికేపరిమితమయ్యారు. బుధవారం శార్వరీ నామ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా నగరవాసులు ఇళ్ల నుంచి పెద్దగా బయటకు రాలేదు. పండగను కుటుంబ సభ్యుల మధ్యే ఆనందంగా జరుపుకొన్నారు.రోడ్లపై జనం అంతగా కనిపించలేదు. అత్యవసర పనులు, నిత్యావసర సరుకుల కోసం మాత్రమే అక్కడక్కడా రోడ్లపైకి వచ్చినట్లు అంచనా. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా తీసుకుంటున్న చర్యలపై బుధవారం మంత్రి కేటీఆర్‌ గోల్నాక, అంబర్‌పేట్‌ ప్రాంతాల్లో పర్యటించారు.

ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలుతీరు,ప్రజల నుంచి వస్తున్న స్పందనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ప్రజల ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. కాగా.. హాస్టళ్లలో ఉంటున్నవారు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోపలు ప్రాంతాల్లోని ఠాణాల ఎదుట ఎన్‌ఓసీ పత్రాల కోసం జనాలు బారులుతీరారు. మాల్స్, ఇతరప్రాంతాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్న ప్రజలు పెద్ద మార్కెట్లకు వచ్చేసరికి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇక్కడ భారీ సమూహాలుగా చేరుతుండటంతో పరిస్థితి అదుపు తప్పి ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అధికారులు ఇక్కడ ఆంక్షల విధింపులో కొంత నిర్లక్ష్యం కనబరుస్తున్నారనేఆరోపణలు వినిపిస్తున్నాయి.   

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో నిత్యావసరాల కోసం ఇస్తున్న సడలింపు దారి తప్పుతోంది. మార్కెట్‌ యార్డులు, రైతుబజార్లు రద్దీగా మారుతున్నాయి.  ఈ ప్రదేశాలలో కనీస జాగ్రత్తలు కానరావడం లేదు. ముఖాలకు మాస్కులు, చేతులు శుభ్రం చేసుకోడానికి శానిటైజర్లు ఉపయోగించక పోవడంతో  కరోనా ఉపద్రవం మరింత విజృంభించే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌ వద్ద వినియోగదారుల క్యూ, సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించడం, శానిటైజర్‌తో చేతులు కడుక్కొనేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కానీ పెద్ద మార్కెట్లు, రైతుబజార్ల వద్ద ఇలాంటి చర్యలు కనిపించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌  ప్రకటించిన నేపథ్యంలో కేవలం నిత్యావసర వస్తువులకు సడలింపు ఇచ్చింది. దీంతో ప్రజలు మార్కెట్, రైతుబజార్లకు తరలి వస్తుండటంతో అక్కడ రద్దీ పెరిగి పోతున్నది. వందలాది మంది ఒకే దగ్గర చేరుతుండంటంతో ఏవరిలో నైనా కరోనా లక్షణాలుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రోడ్డుపైకి రాకుండా వాహనదారులను, ఇళ్ల నుంచి బయటికి వచ్చి గుమ్మిగూడకుండా ప్రజలను కట్టడి చేయడం బాగానే ఉన్నా.. మార్కెట్, రైతు బజార్లలో రద్దీతో వైరస్‌ వ్యాప్తి జరుగదా?  అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బుధవారం నగరంలోని గుడిమల్కాపూర్, కొత్తపేట, సరూర్‌నగర్, తదితర మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. చిన్నచిన్న కూరగాయల మార్కెట్లలో శానిటైజర్లు, ముఖాలకు మాస్కులతో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పెద్ద మార్కెట్ల్‌లో జాగ్రత్తలు పాటించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటకే నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం, వందలాది మంది ఎసోలేషన్‌ వార్డులకు తరలింపు ఆందోళనకు గురిచేస్తుండగా.. తాజాగా మార్కెట్‌ యార్డు, రైతుబజార్లలో రద్దీ మరింత భయందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా మార్కెట్‌ యార్డులు, రైతుబజార్లపై దృష్టి సారించి రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అధిక ధరల నియంత్రణకు కఠిన చర్యలు
సాక్షి, మేడ్చల్‌ జిల్లా : అధిక ధరల నియంత్రణకు జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కొంతమంది వ్యాపారులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాంసం తదితర వాటిని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ధరల నియంత్రణ, కృత్రిమ కొరతపై తగిన చర్యలకు జిల్లా స్థాయిలో అడిషనల్‌ కలెక్టర్‌ అధ్వర్యంలో విజిలెన్స్‌ కమిటీని ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం రైతుబజారుల్లో ఎస్టేట్‌ అధికారులను, గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులను, పురపాలక సంఘాల్లో కమిషనర్లను పర్యవేక్షకులుగా నియమించింది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ధరలకు రెక్కలొస్తున్న నేపథ్యంలో మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.  9492409781, 08418–297820 ఫోన్‌ నంబర్లలో సమాచారం ఇవ్వాలని అధికారులు  పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయించిన దుకాణ యాజమానులపై కేసులు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

వ్యవసాయ పనులు యథాతథం: జిల్లాలో వ్యవసాయ పనులను యథాతథంగా రైతులు చేసుకోనేలా అధికార యంత్రాంగం వెసులు బాటు కల్పించింది. అలాగే రబీ సీజన్‌కు సంబంధించిన 12వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు 9 కేంద్రాలను ఖరారు చేసింది. ఉపాధి హామీ పనులు కూడా యథావిధిగా కొనసాగటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.  

ఇళ్లలోనే నమాజ్‌ చేసుకోవాలి
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక బాధ్యతగా ముస్లింలు ఇంట్లోనే నమాజ్‌ చేసుకోవాలని ఆల్‌ ఇండియా కులహింద్‌ జమియాతుల్‌ ముషాయిక్‌ సహాయ కార్యదర్శి, బాల్కొండ దర్గా షరీఫ్‌ సజ్జదే నసీన్‌ అబ్దుల్‌ ఫతే సయ్యద్‌ బందగీ బాదెషా రియాజ్‌ ఖాద్రీ సూచించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితి దృష్ట్యా ఇంట్లో నమాజ్‌ చేసుకోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, చిన్నారులు మసీదుకు రాకుండా మసీదుల నిర్వాహకులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. మసీదుల్లో ఉన్న కార్పెట్లను తీసివేసి, నేలపై మాత్రమే నమాజు చేయాలని, రోజుకు ఐదుపూటలా ఫ్లోరింగ్‌ను శుభ్రంగా కడగడం, తుడవడము చేయాలని సూచించారు. కేవలం ఫర్జ్, వాజిబ్‌ నమాజులను మాత్రమే మసీదులో చేయాలని, మిగతా నమాజులన్నీ ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు. ప్రతి నమాజు తర్వాత మసీదు గేట్లను మూసివేసి, తరువాతి నమాజుకు కొద్ది ముందుగా మాత్రమే మళ్లీ గేట్లు తెరవాలని అన్ని మసీదు కమిటీలకూ ఇప్పటికే మత పెద్దలు సూచించారని గుర్తు చేశారు. కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. మానవజాతికి ప్రేమ, కరుణ, జాలి, దయ పంచడమే లక్ష్యంగా సూఫీయిజం గత కొన్ని శతాబ్దాలుగా ప్రజా జీవనంలో పెనవేసుకొని ఉందన్నారు. కోవిడ్‌–19 నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అజాగ్రత్తగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement