
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత ఎన్నికల నిర్వహణ పర్వం మొదలైంది. ఈ మేరకు రెండో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణను అధికారులు శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఆదివారం వరకు సాగనుంది. రెండో విడతగా ఏడు మండలాల్లోని 243 గ్రామపంచాయతీలు, 2,068 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, రాజాపూర్, మిడ్జిల్, బాలానగర్, నవాబుపేట, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ మండలంలో రెండో విడత ఎన్నిలకు జరగనుండగా.. తొలి రోజు సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు కలిపి 678 నామినేషన్లు దాఖలయ్యా యి. కాగా, నామినేషన్ల దాఖలకు మరో రెండో రోజులు అవకాశం ఉండడంతో భారీగానే వస్తాయని భావిస్తున్నారు.
అధికార పార్టీలో జోష్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగే ఏడు మండలాలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో ఈ ఏడు మండలాలు ఉండగా.. సర్పంచ్ స్థానాల కోసం ఆశావహులు భారీగానే పోటీ పడుతున్నారు. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ఇద్దరు, ముగ్గురికి పైగా పోటీకి సిద్ధమవుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ పార్టీలో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మండల స్థాయిలో సమన్వయం చేసి శ్రేణులను నడిపించాల్సిన ఆ పార్టీ నాయకత్వం దూరంగా ఉండడంతోనే ఇలా జరుగుతోందని చెబుతున్నారు.