ఆ ఇద్దరికి కరోనా లేదు : మంత్రి ఈటల | No Need To Panic Over Corona Says Etela Rajender | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరికి కరోనా లేదు : మంత్రి ఈటల

Mar 5 2020 4:46 PM | Updated on Mar 5 2020 5:08 PM

No Need To Panic Over Corona Says Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటీవ్‌గా తేలిందని, అదీ దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపారు. వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరి రిపోర్టులు కూడా నెగెటివ్‌గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు పూణే నుంచి వచ్చిన పరీక్ష రిపోర్టులను మంత్రి చూపించారు. భారత్‌లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని అన్నారు. రాబోయే రోజుల్లోనూ కరోనా వైరస్‌ను తెలంగాణలోకి రాకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందన్నారు. (మరో ఇద్దరికి పాజిటివ్‌?)

‘కరోనాతో ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు. మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా అనేది గాలితో వ్యాప్తి చెందదు. నోటి తుంపర్లు ద్వారా కళ్ళలో పడితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తాం. అనుమానం ఉంటే, డబ్బులు ఉంటే కరోనా టెస్టులు చేయం. వైరస్‌ లక్షణాలను డాక్టర్లు నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తాం. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement