ఓటరు మహాశయా.. ఎక్కడున్నావు ?

 The MLAs Are Campaigning Without A Break To Show The Voter God - Sakshi

నీ ఓటు మా పార్టీకే వేయాలి.. 

ఓటరు దేవుడి చుట్టూ అభ్యర్థుల ప్రదక్షిణలు

నియోజకవర్గాల్లో ఊపందుకున్న ప్రచారం

రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతో నెలకొన్న సందడి

మేనిఫెస్టోలు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం

కళాకారులతో వినూత్న ప్రచారాలు

ఎమ్మెల్యే అభ్యర్థుల దృష్టి అంతా ఇప్పుడు ఓటర్లపైనే ఉంది. ఓటరు మహాశయా.. ఎక్కడున్నావు ? అంటూ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో  ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల సమరానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ స్వల్ప కాలంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ వారు గెలిస్తే ఏం చేస్తారో.., అలాగే మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మెదక్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్‌లో నువ్వా..? నేనా..? అన్నట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. మరి ఓటర్లు ఎవరిని కనికరిస్తారో..? వేచి చూడాలి.

సాక్షి, మెదక్‌: ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపుకోసం ఇంటింటా జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. రోడ్‌షోలు,  సభల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే  మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు.  గెలిపిస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే పనులు, పరిష్కరించే సమస్యలను గురించి హామీలు గుప్పిస్తున్నారు. దీనికితోడు  అభ్యర్థుల ప్రచార రథాలు ఊరురా తిప్పుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ప్రధాన  పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు కళాకారులను రంగంలోకి దింపారు. కళాకారులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పట్టణాలు, గ్రామాల్లోని కూడలిల వద్ద పాటలు పాడుతూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు హైటెక్‌ ప్రచారం చేస్తున్నారు. డిజిటల్‌ వీడియోల ద్వారా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. 

ఇంటింటి ప్రచారం...
మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో ఒక అడుగు ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో ఓ విడత ప్రచారం ముగించుకున్న ఆమె మలివిడతలోనూ ప్రతీరోజు రెండు మండలాల్లో ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళా ఓటర్లను ఎక్కువగా కలిస్తున్నారు.  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి తన సోదరుడు శశిధర్‌రెడ్డితో కలవడంతో కాంగ్రెస్‌ ప్రచారం ఊపందుకుంది.

కాంగ్రెస్‌ కార్యకర్తలందరినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య కూడా నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నాయకులు, విద్యార్థి నాయకులతో జోరుగా ప్రచారం చేయిస్తున్నారు.

బీజేపీకి ఒక్కమారు అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానంటూ ఆకుల రాజయ్య హామీలు ఇస్తున్నారు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి యాదేశ్వర్‌తోపాటు ఇతర అభ్యర్థులు కూడా వారి పరిధి మేరకు ప్రచారం చేస్తున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top