రూ.52,700 కోట్లు కేటాయించండి

Minister Harish Rao Meets Finance Committee Cahirman In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  తెలంగాణలో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాలు, భగీరథకు వచ్చే ఐదేళ్ల పాటు నిర్వహణ వ్యయం కోసం రూ.52,700 కోట్ల మేర ప్రత్యేక గ్రాంట్లు కేటాయించేలా సిఫారసు చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్, సంఘం కార్యదర్శి అరవింద్‌ మెహతాతో మంత్రి హరీశ్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. తెలంగాణకు నిధుల ఆవశ్యకతపై సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌కు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరం, భగీరథలపై ప్రశంసలు..
సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌కు అందజేశామని హరీశ్‌ చెప్పారు. ‘రాష్ట్ర ‡అభివృద్ధి పనులను 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ కొనియాడారు. కాళేశ్వరం, భగీరథ అద్భుత ప్రాజెక్టులని ప్రశంసిం చారు. కేసీఆర్‌కు అభినందనలు తెలపమని చైర్మన్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల పథకాల నిర్వహణకు, అలాగే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వాలని కేసీఆర్‌ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని 83 మీటర్ల నుంచి దాదాపు 670 మీటర్ల వరకు ఎత్తాల్సి వస్తోంది. దీనికి నిర్వహణ వ్యయం ముఖ్యమైంది. గత ఐదేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తిచేశాం. వాటికి వచ్చే ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయంగా రూ.42 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా సీఎం లేఖ రాశారు. భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. దానినీ పూర్తిచేసి ప్రజలందరికీ నీళ్లు ఇస్తున్నాం. దీని నిర్వహణకు కూడా వచ్చే ఐదేళ్లలో రూ.11 వేల కోట్ల మేర నిధులు గ్రాంటు రూపంలో ప్రత్యేకంగా మంజూరు చేయాలని కోరాం.’అని చెప్పారు. 

తెలంగాణ, గుజరాత్‌ నష్టపోవద్దు..
కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇంటింటికీ తాగునీరు పథకానికి ప్రస్తుతం నిధులు ఇస్తోందని హరీశ్‌ అన్నారు. ‘తెలంగాణ, గుజరాత్‌ ముందే ఈ పథకం అమలుచేసినందున ఈ రాష్ట్రాలు నష్టపోవడం సమంజసం కాదు. దీంతో నిర్వహణ వ్యయం గ్రాంటుగా ఇవ్వాలని కోరాం. ఇందుకు 15వ ఆర్థిక సంఘం తగిన రీతిలో సిఫారసు చేయాలని కోరాం. ఈ రెండు అంశాలకు వారు సానుకూలంగా స్పందించారు. కొత్త రాష్ట్రమైనా సీఎం కేసీఆర్‌ బాగా పనిచేశారని వారు ప్రశంసించారు. మీ వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. కమిషన్‌ కాలపరిమితి ఏడాది పొడిగించినందున ప్రాంతీయ సదస్సులు పెట్టాలనుకుంటున్నామని కమిషన్‌ చెప్పింది. దక్షిణ భారత ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌ లో పెట్టేలా ఆలోచన చేస్తున్నామని వారు అన్నారు. హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని చెప్పారు. మేం కూడా వారిని ప్రాజెక్టు చూసేందుకు ఆహ్వానించాం. సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే మేం ఆతిథ్యం ఇస్తామని కూడా చెప్పాం..’అని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top