అదే ప్రతిపాదిత అజెండా.. అదే మూసాలో చర్చ.. గందరగోళ స్థితిలో ఆమోదాలు.. ఏమాత్రం స్పష్టతలేని నిర్ణయాలు.. అన్నట్లు కొనసాగింది మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం.
వేములవాడ : అదే ప్రతిపాదిత అజెండా.. అదే మూసాలో చర్చ.. గందరగోళ స్థితిలో ఆమోదాలు.. ఏమాత్రం స్పష్టతలేని నిర్ణయాలు.. అన్నట్లు కొనసాగింది మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం. జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో సోమవారం ఆలయ కళామంటపంలో సమావేశం నిర్వహించారు. ప్రారంభంలోనే ఏటా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జరిగే సమావే శాన్ని ఈ సారి జేసీ నేతృత్వంలో నిర్వహించి దులుపేసుకోవటం బాధగా ఉందని ప్రజాప్రతినిధులు పేర్కొనడం అక్కడి వాతావరణాన్ని గంభీరంగా మార్చేసింది.
అధికారులు మొక్కుబడిగా తమతమ శాఖలవారీగా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపారు. మరోపక్క ప్రజాప్రతినిధులు సమస్యలను వివరించారు. మొత్తం ఎవరికివారే యమనాతీరే అన్నట్లుగా సాగింది సమావేశమంతా.. భక్తుల అవసరాలకు అనుగుణంగా నూతన సంగతులు సమీక్షకు నోచుకోలేదు. ఏ శాఖల అధికారులు ఏబాధ్యతలు నిర్వహించాలన్నది మొక్కుబడిగా చర్చించి మమ అనిపించారు.
పోలీసు బందోబస్తు, ఆరోగ్యశాఖ కేంద్రాలు, పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్ స్థలాల ఎంపిక, రవాణా సదుపాయాలు తదితర అంశాలు నివేదికలో భాగమయ్యాయి. ఇవన్నీ ఏటా జరిగేవేనని. అయినా ఇక్కట్లు తప్పడంలేదని స్థానిక నాయకులు ఎత్తిచూపారు.
తాగునీటికోసం నిలదీత...
ఎల్‌ఎండీ-వేములవాడ శ్రీరాజరాజేశ్వర తాగునీటి పథకం పూర్తిచేయడంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ నాయకుడు చిలుక రమేశ్ నిలదీశారు. ఆయనకు మాజీ సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మాట్లాడుతూ త్వరలోనే నీళ్లు సరఫరా అవుతాయని చెప్పారు. పలుమార్లు హామీలిచ్చి నెరవేర్చలేదంటూ రమేశ్ అన్నారు.
టీఆర్‌ఎస్ నాయకులు కలగజేసుకుని గత ప్రభుత్వం మీదేకదా.. అప్పుడు ఏంచేశారంటూ నిలదీశారు. దీంతో పదినిమిషాలపాటు వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే జోక్యంతో సద్దుమణిగింది. నాయకులు రేగుల మల్లికార్జున్, నందిపేట సుదర్శన్, వాసం మల్లేశం, రాపెల్లి శ్రీధర్ పలు అంశాలను లేవనెత్తారు. వీరు సమస్యలు వివరించే ప్రతీసారీ వేదికపైనున్న అధికారులు తమలోతాము మాట్లాడుకోవడం.. లేదంటే సెల్‌ఫోన్‌లో తలమునకలవడమే కనిపించింది. ప్రధానంగా అధికారులు మాట్లాడినప్పుడు మినహా ప్రజాప్రతినిధులు మాట్లాడిన ప్రతీసారీ జేసీ అసహనంగానే ఫీలయ్యారు.
ఇవీ పరిశీలనకు స్వీకరించినవి...
భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు వసతి గదుల విచారణ కార్యాలయ మార్పుఅంశాన్ని స్థానిక నాయకులు ఎత్తిచూపారు. టీటీడీ ధర్మశాలలవద్దకు తరలించేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. స్పందించిన ఈవో కమిషనర్ అనుమతులకోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించేందుకు మూలవాగులో తాత్కాలిక కాజ్‌వే నిర్మాణాన్ని చేపట్టాలని నాయకులు సూచించారు.
పట్టణాన్ని బారికేడ్లతో మూసేయడం సరికాదని నగరపంచాయతీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ సూచించారు. ప్రైవేటు లాడ్జీలు, అద్దె గదుల నిర్వహణ, ధరల నియంత్రణ తదితర అంశాలను ప్రస్తావించారు. మూడు వాహనాలతో కూడిన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈవో రాజేశ్వర్, జెడ్పీ సీఈవో అంబ య్య, ఆర్డీవో భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, సీఐ రమేశ్‌బాబు, నగరపంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమ, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ వినోద్ గౌడ్, జెడ్పీటీసీశ్రీకాంత్ పాల్గొన్నారు.


