పార్లమెంట్‌ ఎన్నికలకు కసరత్తు | Lok Sabha Election All Party Ready Nalgonda | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఎన్నికలకు కసరత్తు

Dec 28 2018 9:54 AM | Updated on Mar 18 2019 9:02 PM

Lok Sabha Election All Party Ready Nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పార్లమెంట్‌ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా ముగించిన అధికారులు పార్లమెంట్‌ ఎన్నికలను కూడా సమర్థంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణకు సిద్ధమవుతోంది. పార్లమెంట్‌ ఎన్నికలు కూడా గడువుకంటే ముందే వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాల పెంపునకు నిర్ణయం
జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ కేంద్రాలను పెంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో రాత్రి అయినా కూడా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయడానికి ఓటర్లు బారులుదీరారు. అత్యధిక సమయం క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జిల్లా అధికారులు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,967 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈ పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి .. మూడు జిల్లాల కలెక్టర్లు నిర్ణయించి నివేదికలు సమర్పించారు. అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 198 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేయాలని సీఈఓకు నివేదికలు పంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో 1200 మంది ఓటర్లు ఉంటారు. ఆ సంఖ్యను 1100కు కుదించాలని నిర్ణయించారు.

పట్టణాల్లో కూడా ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో 1400 మంది ఓటర్లు ఉంటారు. ఈ సంఖ్యను 1300లకు కుదించాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన వీవీ ప్యాట్ల కారణంగా పోలింగ్‌లో ఆలస్యం జరిగింది. ఈ అంశాలన్ని పరిశీలించి, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసమస్యలు పరిష్కారం కావాలంటే పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచడమే మేలన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 1629 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా 113 పోలింగ్‌ కేంద్రాలను పెంచాలని జిల్లా ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల అధికారికి నివేదికలు పంపారు. దీంతో నల్లగొండ జిల్లాలో మొత్తం 1742 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 786 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా కొత్తగా 78 కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదికలు పంపారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో 552 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 6 పోలింగ్‌ కేంద్రాలు పెంచాలని నిర్ణయించి ఆ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు.
 
ఓటరు నమోదుకు నెల రోజులు గడువు
ఓపక్క పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను కుదించడంతో పాటు మరోపక్క ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి జనవరి 25 తేదీ వరకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు నమోదు చేసుకునేందుకు  కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు గల్లంతైనవారు ఉన్నారు. వారందరూ కూడా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కారణంగా జిల్లాలో భారీ ఎత్తున ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు కొత్త ఓటర్ల నమోదు.. అటు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల కుదింపును దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ కేంద్రాలను పెంచాలని నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement