లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం.. | KCR's son dares Naidu to undergo lie-detector test | Sakshi
Sakshi News home page

లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం..

Jun 9 2015 4:18 AM | Updated on Jul 28 2018 6:48 PM

లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం.. - Sakshi

లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం..

‘రేవంత్‌రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు.

మరి చంద్రబాబు కూడా సిద్ధమా?
ఆరోపణలపై ఏపీ సీఎంకు మంత్రి కేటీఆర్ సవాల్
ఎమ్మెల్సీ ముడుపుల వ్యవహారంపై యాగీ చేయొద్దు
రెండు రాష్ట్రాల గొడవగా చిత్రీకరించొద్దని హితవు

సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్‌రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు. మిగతా పార్టీలపై  దుమ్మెత్తిపోసే ఆదర్శపురుషుడు, యుగపురుషుని నోటికి తాళం ఎందుకు పడింది.

అడ్డంగా దొరికిపోయినా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎందుకు మాట్లాడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంటూ దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తూ, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అంతరం సృష్టించేందుకు నీచరాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నావ్..’ అని తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు నిప్పులుగ క్కారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాపై వచ్చిన ఆరోపణలపై టీవీ చానళ్లలో లైవ్ టెలికాస్ట్(ప్రత్యక్ష ప్రసారం)లో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం.. చంద్రబాబు నువ్వు సిద్ధమా.. రాష్ట్ర ప్రజల ముందు తేల్చుకుందాం.. ఎవరు దొంగలో ప్రజలకు తెలవాలి.

బాబూ నీకు, నీ తొత్తులకు, నీ తొత్తు చానళ్లకు పొరపాటున దమ్ముంటే సిద్ధమా..’ అని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. వ్యక్తిగత అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్సీ కొనుగోలు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బాబు కుట్రలను ప్రజలు గమనించాలని, ఆయన ఇకనైనా శిఖండి రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. ఎమ్మెల్సీకి లంచం ఇచ్చిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ది తప్పయితే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేదా తాను చేసింది తప్పని అంగీకరించాలని డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాప్ చేశారంటవ్, గొంతు నాది కాదంటవ్.

ఇరు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెడతానంటే కుదరదు. కేసీఆర్‌పై బట్ట కాల్చి మీదేయకు. బాబు తన నీతి బాహ్యమైన చర్యల వల్ల ఏపీ ప్రజలకు తలవంపులు తెచ్చిపెట్టాడు. సిగ్గుతో తెలుగు ప్రజలు త లొంచుకుంటున్నరు. ఆయన తప్పించుకోలేడు. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని, ఆయన వ్యవహారంలో అసలు ప్రభుత్వ ప్రమేయమే లేదని వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ చేశారని చంద్రబాబు సిగ్గువిడిచి ఆరోపిస్తున్నారని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, అడ్డగోలుగా మాట్లాడవద్దని హితవు పలికారు. చట్టానికి అంతా సమానులేనని, బాబుగారైనా, వాళ్ల బాబు అయినా చట్టానికి ఒకటేనని, ఏసీబీ విచారణ జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు రాజీనామా చేయాలి: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణలో ఎక్కడా జోక్యం చేసుకోదు. చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు’ అని స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన దౌర్భాగ్యం తమ ప్రభుత్వానికి పట్టలేదని, చంద్రబాబుకు, టీడీపీ నేతలకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.

ఎప్పుడూ మైకులు మెడలో వేసుకుని తిరిగే బాబు.. రేవంత్‌రెడ్డి కేసుపై ఎనిమిది రోజులుగా ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. ఫోన్ సంభాషణల్లోని గొంతు ముమ్మాటికీ చంద్రబాబుదేనని ఆయన స్పష్టం చేశారు. ఏసీబీ యంత్రాంగం పనితీరుపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. అమాయకులైన ప్రజలను మభ్యపెట్టి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
 
నిస్పృహలో ఏపీ ప్రభుత్వం: వేణుగోపాలాచారి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిస్పృహతో కొత్త కుట్రకు తెరతీస్తోందని, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలను తూర్పార బట్టారు. ‘‘ఏసీబీ కేసులను, మీ అధినేతపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చేందుకు దీనిని రెండు రాష్ట్రాల సమస్యగా అభివర్ణిస్తున్నారు...

నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని జాతి మొత్తం చూసింది. ఏపీ ముఖ్యమంత్రి దీనిని ప్రేరేపించారని, ఆయనే మాట్లాడారని టేపులు బహిర్గతమయ్యాయి. మీరు తీవ్ర నిస్పృహతో ఉన్నారు. అందుకే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఫోన్ ట్యాప్ చేస్తే నేరమంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై కేసు పెట్టారు. సంకల్పదీక్ష పేరుతో కుట్రలు చేస్తోంది మీరు.. దానితో తెలంగాణకే సంబంధం.. మేమెందుకు భగ్నం చేస్తాం?’ అని  వేణుగోపాలాచారి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement