గొర్రెలు, బర్రెలు కాదు..

Instead Of Giving Sheep Govt Should Focus On BC Welfare - Sakshi

బీసీల అభ్యున్నతికి గురుకులాలు ఏర్పాటు చేయాలి 

కార్పొరేషన్‌  రుణాలకు రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి 

లేదంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య

సాక్షి, షాబాద్‌(చేవెళ్ల): బీసీ కార్పొరేషన్‌లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం షాబాద్‌ మండల కేంద్రంలోని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్‌లో రుణాలకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌లో 5,47 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు నెలలోపు రుణాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేయడం కాదు, వారి అభ్యున్నతి కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. చదువుకున్న చదువులకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందూరి రాములు, జిల్లా కార్యదర్శి రాపోల్‌ నర్సింలు, నాయకులు సూద యాదయ్య, రామకృష్ణ, శ్రీశైలం, చందు, రమేష్, కృష్ణ, రామకోటి, శివ, తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top