ముంచెత్తిన పత్తి | hike on the cotton | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన పత్తి

Dec 24 2014 3:33 AM | Updated on Jun 4 2019 5:04 PM

ముంచెత్తిన పత్తి - Sakshi

ముంచెత్తిన పత్తి

వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు తెల్లబంగారం పోటెత్తింది. మంగళవారం 46,714 పత్తి బస్తాలు నేరుగా మార్కెట్‌కు

మార్కెట్‌కు 54,924 బస్తాల రాక
ఈ సీజన్‌లోనే అత్యధికం
సీసీఐకే విక్రయించిన రైతులు
 

వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు తెల్లబంగారం పోటెత్తింది. మంగళవారం  46,714 పత్తి బస్తాలు నేరుగా మార్కెట్‌కు రాగా, లూజు రూపేణా 18 వాహనాల్లో మరో 8,210 బస్తాలు మిల్లుల వద్దకు తరలివెళ్లాయి. కొన్ని లూజు పత్తి వాహనాల రైతులు మార్కెట్ ప్రధాన గేటు వద్దకు వచ్చి తూకం వేయించాక సీసీఐ చెప్పిన ప్రకారం మిల్లుల వద్దకు వెళ్లారు. ఈ సీజన్‌లో ఇదే రికార్డు అని అధికారు లు తెలిపారు. 18 లూజు పత్తి వాహనాలతోపాటు 37,650 బస్తాలను  క్వింటాల్‌కు రూ.4,050-3,800 ధరతో కొనుగోలు చేయగా.. ప్రైవేటు ట్రేడర్లు 9,064 బస్తాలను క్వింటాల్‌కు రూ.4,065-3,700 నామమాత్రంగా కొనుగోలు చేయించారు. సీసీఐ కంటే వ్యాపారులు ధర ఎక్కువ పెట్టినప్పటికీ రైతులు ఎక్కువగా సీసీఐకే విక్రయించారు. మార్కెట్‌కు పత్తిని భారీగా తరలించడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. ఈ ఏడాది సీజన్ మొదలైనప్పటి నుంచి ఒకే ఒక రోజు మార్కెట్‌కు మొత్తంగా 50వేల బస్తాల పత్తి మార్కెట్‌కు తరలివచ్చింది. ఇక అప్పటి నుంచి ఏ రోజు కూడా 20వేల బస్తాలకు మించి పత్తి మార్కెట్‌కు రాలేదు. 20 రోజులుగా 10వేల బస్తాలు కూడా మార్కెట్‌కు రావడం లేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా 54,924 బస్తాల తెల్ల బంగారం మార్కెట్‌ను ముంచెత్తడంతో అటు మార్కెట్, సీసీఐ అధికారులు, ఇటు ట్రేడర్స్, ఖరీదుదారులు కంగుతిన్నారు.

ఎప్పుడు అమ్ముదామన్నా  సెలవులే

మార్కెట్‌లో రెండు నెలలుగా పత్తి ధర బాగా పడిపోయింది. పైగా ఎప్పుడు అమ్ముదామన్నా వరుస సెలవులే ఉంటున్నాయి. అనుకోకుండా ధర కూడా పెరగడంతో ఇంటి వద్ద ఉంచుకున్న పత్తిని అమ్మకానికి తీసుకొచ్చాను.
 -ఎం.రాజు, పత్తి రైతు, సాధనపల్లి
 
ధర పెరగదని మర్కెట్‌కు వచ్చా
 

ఈసారి పంట సరిగా పండలేదు. ధర పెరుగుతుందని పత్తి అమ్మలేదు. రోజురోజుకు ధర పడిపోతుంది తప్ప పెరగడం లేదు. ఈసారి ఎందుకో పత్తి నల్లగైపోతుంది. దీంతో చేసేది లేక కొద్దిపాటి ధర పెరగగానే అమ్మకానికి తెచ్చాను.

 - బొల్లె సారయ్య,
 పత్తి రైతు, మల్లారెడ్డిపల్లి   
 
 

Advertisement
 
Advertisement
Advertisement