అప్పులబాధతో అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అడ్డాకల్ (మహబూబ్‌నగర్) : అప్పులబాధతో అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం దాసరపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్(37) అనే రైతు సోమవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన వెంకటేష్ తనకున్న ఎకరం పొలంతోపాటు అన్నదమ్ములకు చెందిన మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది ఆముదం పంట వేశాడు. విత్తనాలు వేసిన సమయంలో సరైన వర్షాలు కురవకపోవడంతో.. విత్తనాలు మొలకెత్తలేదు.
అయితే ఆ పంటను తొలగించి తిరిగి మరో పంట వేద్దామనుకుంటే చేతిలో డబ్బు లేదు. గ్రామంలో ఎవరిని అడిగినా అప్పు పుట్టక పోవడంతోపాటు.. బంధువుల దగ్గర తీసుకున్న అప్పు తీర్చే దారి కనిపించకపోవడంతో నిన్న రాత్రి బావి వద్దకు వెళ్తున్నానని వెళ్లి అక్కడే ఉన్న చెట్టుకు విద్యుత్ తీగలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.