మరో పాజిటివ్‌

Covid 19: Fifth Positive Case Registered In Telangana - Sakshi

వైరస్‌ బారిన ఇండోనేసియావాసి

రాష్ట్రంలో ఐదో కరోనా కేసు 

ఇటీవల ఢిల్లీ మీదుగా రాష్ట్రానికి రాక

అతనితో ఉన్న మరో 10 మంది ఐసోలేషన్‌లో...

ఇకపై పుణేతో పనిలేదు.. 

గాంధీలోనే తుది నిర్ధారణ పరీక్షలు

రాష్ట్రంలో ఆరు కరోనా పరీక్షల ల్యాబ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు పాజిటివ్‌ కేసులు బయటపడగా మంగళవారం ఐదో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందంలో ఒకరికి వైరస్‌ సోకినట్లు వెల్లడించింది. మొదట ఢిల్లీ వచ్చిన ఆ బృందం... అక్కడి నుంచి ఈ నెల 9న రాష్ట్రానికి వచ్చింది. బృందంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వారంతా కరీంనగర్‌ వెళ్లి అక్కడి ఒక ప్రార్థనా కేంద్రంలో బస చేశారు.

వారిలో ఒకరైన 58 ఏళ్ల విదేశీయుడిలో వైరస్‌ అనుమానిత లక్షణాలు బయటపడటంతో సోమవారం స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేపట్టారు. అక్కడి డాక్టర్లకు అనుమానం రావడంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రికి రెఫర్‌ చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆయనతోపాటు కలసి ఉన్న 10 మందిని ఐసోలేషన్‌లో పెట్టారు. అలాగే వారంతా గత కొద్ది రోజులుగా ఎక్కడెక్కడ తిరిగారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. వారి దగ్గర నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించింది.

వివిధ దేశాల విమాన సర్వీసులు రద్దు...
అఫ్గానిస్తాన్, మలేసియా, యూకే, ఫిలిప్పీన్స్‌ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసిన ప్రభుత్వం... ఈ నెల 31 వరకు యూరోపియన్‌ యూనియన్, టర్కీ, నుంచి వచ్చే విమాన సర్వీసులనూ రద్దు చేయనుంది. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చిన 221 మందిని వికారాబాద్, దూలపల్లిలోని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించింది. అలాగే విదేశాల నుంచి వచ్చే తెలంగాణవాసులను ఏ జిల్లా వారిని అదే జిల్లాలో ఐసోలేషన్‌లో ఉంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే 1,238 మంది ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు చేపట్టింది. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాల నుంచి వచ్చిన వారిని ఇప్పటివరకు ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తుండగా బుధవారం నుంచి యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్‌ దేశాల నుంచి వచ్చే వారిని కూడా ఐసోలేషన్‌లోనే ఉంచనుంది. 

మహారాష్ట్ర, కర్ణాటకలతో సరిహద్దు క్లోజ్‌?
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తెలంగాణ సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మొత్తం సరిహద్దును బంద్‌ పెట్టాలా? ఒకవేళ సరిహద్దు మూసేస్తే ఎటువంటి సమస్యలొస్తాయన్న దానిపై కసరత్తు చేస్తోంది. కాగా, వైరస్‌ బారినపడి పూర్తిగా కోలుకున్న రాష్ట్రంలోని మొదటి బాధితుడు, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని బుధవారం విలేకరుల సమక్షంలో మాట్లాడిస్తామని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో నివసిస్తున్న వారెవరికీ వైరస్‌ లేదు: మంత్రి ఈటల
తెలంగాణలో నివసిస్తున్న ప్రజలెవరికీ కరోనా వైరస్‌ లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్లేనన్నారు. ఇప్పటివరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 66,182 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశామన్నారు. అలాగే 464 మందికి పరీక్షలు చేయగా అందులో ఐదుగురికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. దుబాయ్‌ వచ్చిన మొదటి కరోనా పాజిటివ్‌ వ్యక్తి 88 మందిని కలిశాడనీ, వారందరికీ నెగెటివ్‌ వచ్చిందన్నారు. అలాగే రెండో పేషెంట్‌ అయిన ఇటలీ నుంచి వచ్చిన యువతి 42 మందిని, మూడో పేషెంట్‌ 69 మందిని, నాలుగో పేషెంట్‌ 11 మంది కలిశారని వారందరికీ కూడా నెగిటివ్‌ వచ్చిందన్నారు. కరోనాకు సంబంధించి ఇకపై రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామన్నారు.

నిమ్స్‌లో కేన్సర్‌ రోగికి కరోనా?
లక్డీకాపూల్‌: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేన్సర్‌ రోగికి కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేడియోథెరపీ చికిత్స కోసం నిమ్స్‌ వచ్చిన వెస్టిండిస్‌కు చెందిన యామాని అనే రోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అందుకు అనుగుణంగా అతనికి రేడియోతెరపీ చేస్తూనే ఇతర వ్యాధులు సొకకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నిమ్స్‌లో చికిత్స కోసం వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా ఉన్నట్లు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌లో కూడా కరోనా నోడల్‌ బృందాన్ని ఏర్పాటు చేసే దిశగా యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

3000 ప్రత్యేక నిఘా బృందాలు
రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడం, అనుమానిత లక్షణాలున్న వారు గాంధీ ఆసుపత్రికి పోటెత్తడంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న వేలాది మంది ప్రయాణికులతోపాటు వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తులతో కలసి ఉన్న వారిని, వారు ఇంకెవరిని కలిశారన్న దానిపై ఆరా తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3 వేల నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అనుమానితులు, లక్షణాలున్న వారిని, ఆయా వ్యక్తులు కలిసిన ప్రజలను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

ఆరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు
ప్రస్తుతం గాంధీ, ఉస్మానియాతోపాటు ఫీవర్‌ ఆసుపత్రి, ఐపీఎం, నిమ్స్, వరంగల్‌ ఎంజీఎంలలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం ల్యాబ్‌లు సిద్ధం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్‌గా వచ్చిన నమూనాలను తుది నిర్ధారణ కోసం పుణేకు పంపగా ఇకపై గాంధీలోనే తుది పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ కేసులను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించనుంది.

శానిటైజర్లు వీఐపీలకేనా?
రాష్ట్రంలో వేలకు వేలు శానిటైజర్లు, మాస్క్‌లు తెప్పిస్తున్నామని చెబుతున్న వైద్యాధికారులు వాటిని నచ్చిన వారికి, వీఐపీలకే తరలిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) నుంచి ఆసుపత్రులు, వైద్య కార్యాలయాలకు శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా కావాల్సి ఉండగా వాటి కోసం ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర వీఐపీలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అధికారులు శానిటైజర్లు, మాస్క్‌లను వారి ఇళ్లకు తరలిస్తున్నారని సమాచారం. కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూంతోపాటు వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకుల ఆఫీసుల్లోనూ శానిటైజర్లు అందుబాటులో లేకపోవడం విచిత్రం. కాగా, కొందరు ఉద్యోగులు మాస్క్‌లు, శానిటైజర్లను అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

చదవండి:
మానవ స్పర్శకు కరోనాతో గండి
ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు
కరోనాపై ట్వీట్‌; ట్రోల్స్‌ బారిన పడిన నటి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top