మానవ స్పర్శకు కరోనాతో గండి

Katherine Johnson Wrote Special Story On Corona Changes Human Behaviour - Sakshi

విశ్లేషణ

వ్యక్తులతో ముఖాముఖిగా కాకుండా వర్చువల్‌గానే ఎక్కువగా సంభాషిస్తున్న, టెక్నాలజీ ప్రాధాన్యం–సామాజిక అనుసంధానం తెగిపోవడం ప్రాతిపది కన నడుస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం కనుకే మానవ స్పర్శ అనేది మనిషి జీవితంలో తగ్గుముఖం పడుతోంది. ఒకసారి కరోనా వైరస్‌ పరిసమాప్తి అయ్యాక, మనకు ఎదురయ్యే పెను సవాల్‌ మానవ స్పర్శ పట్ల మన ఆలోచనలను పునర్నిర్మించుకోవడం ఎలా అన్నదే. కరోనా వైరస్‌కి చెందిన భయానకమైన అనుభవం నుంచి వైదొలగడానికి కూడా మనకు ఒక స్పర్శ, ఒక వెచ్చని కౌగిలింత అవసరం కావచ్చేమో మరి.

మానవులకు స్పర్శ అనేది విస్తారమైన ప్రయోజనాలను కలిగిస్తుందనడంలో సందేహమే లేదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా, ప్రజలు అనేక కారణాలతో సామాజికంగా ఇతరులను స్పర్శించడం పట్ల జాగరూకంగా ఉంటూండటం పెరుగుతూ వస్తోంది. తాజాగా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ ముట్టడిస్తుండంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ప్రజలు ఇప్పటికే పరస్పరం చేతులు కలపటాన్ని మానేస్తున్నారు. బ్రిటిష్‌ రాణి సైతం వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి ముందుజాగ్రత్తగా చేతులకు గ్లోవ్స్‌ ధరించి కనిపించారు. ఇప్పటికే పరస్పరం చేతులు కలపడాన్ని వీలైనంతవరకు మానేయాలి అనే భావన ప్రపంచంలో ఉనికిలో ఉంది. కరోనా వైరస్‌ ఈ కరస్పర్శకు సంబంధించి దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగించనుంది.

మానవ స్పర్శకు అంత ప్రాధాన్యత ఎందుకు? మనం ఇతరుల పట్ల ఎలా అనుభూతి చెందుతున్నామో స్పర్శ చాటుతుంది. మన మాటల వ్యక్తీకరణను స్పర్శ పెంచుతుంది. ఉదాహరణకు ఇతరులను ఓదార్చుతున్నప్పుడు వారి చేతిని స్పర్శించడం అనేది మనం వారి పట్ల నిజంగా కేర్‌ తీసుకుంటున్నామని తెలుపుతుంది. తమ జీవితకాలం పొడవునా ప్రజలు భౌతిక స్పర్శ ద్వారా ప్రయోజనం పొందుతూనే ఉంటారు. మనిషికి స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో సంభవించే క్షేమం, సుఖసంతోషాలపై ప్రభావం చూపే స్పర్శ సామర్థ్యానికి సంబంధించి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కూడా. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి మానవ స్పర్శ అనేది ఎంతో కీలకమైంది. 

ఒత్తిడిని తగ్గించే సంజీవని స్పర్శ
సామాజిక స్పర్శకు చెందిన భావోద్వేగ ప్రభావం మన జీవశాస్త్రంలో అంతర్నిహితంగా ఎప్పట్నుంచో కొనసాగుతోంది. స్పర్శ అనేది ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌ అయిన అక్సిటోసిన్‌ విడుదలను వేగవంతం చేస్తుంది. నిజానికి, మానవులలో ఒత్తిడి స్థాయిలను తగ్గించే శక్తి ఒక్క స్పర్శకు మాత్రమే ఉంది. శస్త్రచికిత్సకు ముందు రోగిని నర్సు ఊరకే అలా స్పర్శిస్తే చాలు.. రోగుల్లో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందని మనందరికీ తెలుసు. తాము సమాజం నుంచి వేరుపడ్డామనే అనుభూతిని స్పర్శ తగ్గిస్తుంది. అంతేకాకుండా నర్సింగ్‌ హోమ్‌లో గడుపుతున్న వృద్ధులు తీసుకునే ఆహార పరిమాణాన్ని కూడా స్పర్శ పెంచుతుంది. ప్రజల క్షేమానికి, సుఖసంతోషాలకు సామాజిక స్పర్శ ఎంత అవసరమైనదో తెలుస్తోంది కనుక, ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్పర్శకు అత్యంత ప్రధానమైన పాత్ర ఉందని అర్థం చేసుకోవాలి.

సామాజిక స్పర్శ తగ్గుముఖం
గత కొన్ని దశాబ్దాల్లో సామాజిక స్పర్శ అనేది తగ్గుముఖం పడుతోంది. వ్యక్తులతో ముఖాముఖిగా కాకుండా వర్చువల్‌గానే ఎక్కువగా సంభాషిస్తున్న టెక్నాలజీ ప్రాధాన్యం, సామాజిక అనుసంధానం తెగిపోవడం ప్రాతిపదికన నడుస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం కనుకే మానవ స్పర్శ మనిషి జీవితంలో తగ్గుముఖం పడుతోంది. అంటే గతంలోకంటే ఇప్పుడు మనం చాలా తక్కువగా మాత్రమే పరస్పరం స్పర్శించుకుంటున్నామని దీనర్థం. అయితే మనుషుల మధ్య స్పర్శ తగ్గుముఖం పట్టడానికి ప్రధానంగా అసభ్య స్పర్శ ప్రభావానికి గురికావలసి వస్తుందన్న భయమే కారణం. 

కరోనా వైరస్‌ ప్రభావం
ఇప్పుడు కరోనా వైరస్‌ విస్తరణతో ఎదుటివారిని స్పర్శించాలంటేనే ప్రజలు భీతిల్లుతున్నారు. అలా తాకడం ద్వారా అప్పటికే వైరస్‌ సోకిన వ్యక్తులనుంచి తమకూ వైరస్‌ సోకుతుందన్న భయం ఎక్కువవుతోంది. అంటే ఎదుటివారందరూ వైరస్‌ వాహకాలే అని భావించడం మరింత భయపెడుతోంది. కరోనా వైరస్‌ తారస్థాయిలో చెలరేగుతున్నందున ఇతరులను స్పర్శించడం పట్ల జాగ్రత్తగా ఉంటూనే వైరస్‌ మితిమీరిపోకుండా తగిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు వైరస్‌ గురించి తీవ్రమైన ఆందోళనలతో గడుపుతున్నందువల్ల అలాంటివారిని స్పర్శద్వారా పరామర్శిస్తే ఆ ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. 

ఇలా మనుషులు తోటి మనుషులకు దూరంగా మెలగడం దీర్ఘకాలంపాటు కొనసాగితే సామాజిక స్పర్శకు, దానిపట్ల ప్రతికూల వైఖరికి మధ్య ఒకరకమైన సహసంబంధం నెలకొనే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతకాలానికి ప్రజలు వైరస్‌ గురించి మర్చిపోవచ్చు కానీ సామాజిక స్పర్శ పట్ల వారి భయం అలాగే కొనసాగవచ్చు. తామెం దుకు అలా దూరదూరంగా ఉంటున్నామో వారికి బహుశా తెలీకపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రజల మధ్య సానుకూల సంబంధాల కంటే ప్రతికూల సంబంధాలే ఎక్కువగా మనుషుల జ్ఞాపకాలను ప్రభావితం చేయవచ్చు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పర్శ అవసరం
అయితే వైరస్‌ ప్రబలిపోయిన సమయంలో ప్రజలు పరస్పరం స్పర్శిం చుకోవడం మంచిది కాదు. ప్రత్యేకించి వృద్ధులు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని వారితో స్పర్శకు దూరంగానే ఉండాలి. అయితే మన చేతులను మనం పదే పదే శుభ్రపర్చుకుంటున్నంతకాలం మనకు ప్రియమైన వారితో భౌతిక స్పర్శను కొనసాగిస్తూనే ఉండవచ్చు. కరోనా వైరస్‌ వంటి ప్రతికూల జీవన ఘటనలు దీర్ఘకాలంలో అవాంఛనీయమైన రీతిలో సామాజిక స్పర్శపై, వ్యక్తుల మధ్య పరామర్శలపై ప్రతి కూల ప్రభావం చూపవచ్చు. ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ ప్రతికూల ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండటమే.  ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుషుల మధ్య స్పర్శ ప్రాధాన్యతను గుర్తించకపోయినట్లయితే అది మానవ స్పర్శపట్లే ప్రతికూల జ్ఞాపకాలను పెంచే ప్రమాదం ఎంతైనా ఉంది. ఒకసారి కరోనా వైరస్‌ పరిసమాప్తి అయ్యాక, మనకు ఎదురయ్యే పెనుసవాల్‌ మానవ స్పర్శ పట్ల మన ఆలోచనలను పునర్నిర్మించుకోవడం ఎలా అన్నదే. కరోనా వైరస్‌కి చెందిన భయానకమైన అనుభవం నుంచి వైదొలగడానికి కూడా మనకు ఒక స్పర్శ, ఒక వెచ్చని కౌగిలింత అవసరం కావచ్చేమో మరి.

సాహిత్య చరిత్ర మనకు నేర్పే పాఠం
ప్రాచీన కాలంలో హోమర్‌ నుంచి ఆధునిక కాలంలో స్టీఫెన్‌ కింగ్‌ దాకా పాశ్చాత్య సాహిత్య చరిత్రలో సాంక్రమిక వ్యాధుల గురించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. మానవులు ప్రజారోగ్యం సంక్షోభంలో పడినప్పుడు ఎలా స్పందించారో, కెథార్సిస్‌ రూపంలో తమ తీవ్రమైన భావోద్వేగాలను ఎలా ప్రకటించారో, రాజకీయంగా ఎలా వ్యాఖ్యానించారో ఈ కథనాలు చాటి చెబుతూ వచ్చాయి. కోవిడ్‌ 19 సాంక్రమిక వ్యాధి పట్ల మన స్పందనలను కూర్చడంలో సాహిత్యానికి కీలకపాత్ర ఉంది. 

కరోనా వైరస్‌ చుట్టూ అలుముకుంటున్న జాత్యహంకారం, జాతి ఉన్మాదం, వివక్షలను మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా సాహిత్యమే మనకు దారి చూపుతుంది. ప్రాచీన కావ్యాల నుంచి ఆధునిక నవలల వరకు సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనం అనిశ్చితపరిస్థితుల్లో తర్వాత ఏం జరుగుతుందో మార్గదర్శినిగా మనకు దారి చూపుతుంది. హోమర్‌ రాసిన ప్రామాణిక కావ్యం ఇలి యడ్‌.. ట్రాయ్‌ వద్ద విడిది చేసిన గ్రీక్‌ సైనిక శిబిరాల్లో చెలరేగిన ప్లేగ్‌ వ్యాధి గురించిన వర్ణనతో మొదలవుతుంది. క్రిసీస్‌ జాతీయులను బానిసలుగా చేసుకున్న గ్రీకులను శిక్షించడానికే ప్లేగ్‌ విరుచుకుపడిం దని ఆ కావ్యంలో పాత్రలు చెబుతాయి.

గ్రీకుల దుష్ట ప్రవర్తన ఫలితంగానే ప్లేగ్‌ మహమ్మారి వారిపై విరుచుకుపడిందనే నైతిక చర్చను ఇలియడ్‌ లోని పాత్రలు ప్రదర్శించాయి. అలాగే క్రీ.శ. 1353లో గివోవన్నీ బొకాసియో రాసినది డెకమెరోన్, రచనలో కూడా బ్లాక్‌ డెత్‌ సంక్షోభ సమయంలో రెండువారాలపాటు ఏకాంతంగా గడిపిన పాత్రలు నీతి, ప్రేమ, లైంగిక రాజకీయాలు, వాణిజ్యం, అధికారం వంటి అంశాలపై చర్చించాయి. సాంక్రమిక వ్యాధుల కారణంగా స్తంభించిపోయిన సాధారణ జీవితాలను పునర్నిర్మించుకోవడంపై సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పలు రచనలు ఎత్తిచూపాయి. 

20వ శతాబ్దంలో ఆల్బర్ట్‌ కాము రాసిన ‘ది ప్లేగ్‌’ (1942) స్టీఫెన్‌ కింగ్‌ రాసిన ‘ది స్టాండ్‌’ (1978) సాంక్రమిక వ్యాధులు చెలరేగిన సమయంలో సమాజంలో వాటి ప్రభావాలపై దృష్టి పెట్టాయి. సామూహిక ఏకాంతవాసం, ప్రభుత్వాల వైఫల్యాల నేపథ్యంలో సాంక్రమిక వ్యాధిని నివారించడం లేక భయాందోళనలను తగ్గించడంపై ఈ రెండు రచనలూ చర్చించాయి.  ప్రత్యేకించి కామూ నవల ప్లేగ్‌ చెలరేగిన సమయంలో మానవ సంబంధాలు, పౌరుల మధ్య పరామర్శల పట్ల జాగరూకత గురించి వర్ణించింది. కోవిడ్‌ 10 వైరస్‌ కూడా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలను ప్రకంపింప చేస్తూనే గతంలో ఇలాంటి సందర్బాల్లోనే తలెత్తిన సంక్షోభాలను ప్రాచీనులు ఎలా ఎదుర్కొన్నారు అనే చర్చకు దారి తీయడం విశేషం.

వ్యాసకర్త: కేథరీన్‌ జాన్సన్‌,
రీడర్, కన్సూమర్‌ సైకాలజీ,
అంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ (బ్రిటన్‌)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top