టీఆర్‌ఎస్‌ దూకుడును అడ్డుకునేందుకు ప్రణాళిక

Congress Alliance With TDP CPM In Khammam - Sakshi

సాక్షి, మధిర(ఖమ్మం): సీఎల్పీ లీడర్‌గా రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్న మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం మధిరలో మున్సిపల్‌ పోరు రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా మారింది. ఎస్సీ మహిళకు రిజర్వుడు అయిన ఈ స్థానంలో అధికార టీఆర్‌ఎస్‌ పాగా వేయాలని చూస్తుండగా, సీటును ఎలాగైనా దక్కించుకుని తీరుతామని కాంగ్రెస్‌ మిత్రపక్షాలను కలుపుకుని ముందుకెళ్తోంది. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగియగా..సీపీఎం, టీడీపీలతో కూటమిగా కాంగ్రెస్, మొత్తం 22 వార్డులకు ఒంటరిగా టీఆర్‌ఎస్‌ పోటీలో నిలిచాయి. టీఆర్‌ఎస్‌లో రెబల్‌ అభ్యర్థులు తక్కువగా ఉండగా, కూటమిలో ఈ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్, కూటమినుంచి అభ్యర్థులతో పాటు రెబళ్లు, డమ్మీలు నామినేషన్లు వేసినప్పటికీ అధిష్టాన నాయకుల బుజ్జగింపులతో చివరి నిమిషంలో కొందరు బరి నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలను ఇరుపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతున్నాయి. తమపార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యతిరేక పక్షం నుంచి రెబల్‌ అభ్యర్థులను రంగంలోకి దింపుతూ ఇరువర్గాల నాయకులు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారనే చర్చ జరుగుతోంది. నామినేషన్లు ముగియడంతో అసలు వ్యవహారం ఇక షురూ కానుంది. 

భట్టికి ప్రతిష్టాత్మకం..
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఈ మున్సిపాలిటీ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారనుంది. భట్టి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు మల్లాది వాసు, టీడీపీ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రామనాథం, సీపీఎం రాష్ట్ర నేత పోతినేని సుదర్శన్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికతోపాటు మిత్రపక్షాల మధ్య సీట్ల ఒప్పందం, గెలుపుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు పకడ్బందీగా చేస్తున్నారు.

ఎటూ తేల్చని సీపీఐ? 
ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీలు పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా సీపీఐ, టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీచేస్తున్న విషయం విదితమే. అయితే నామినేషన్ల ఉపసంహరణలోగా సీపీఐ కూడా మిత్ర పక్షాలతో కలిసి ప్రయాణించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 

లింగాల ప్రత్యేకత చాటేనా? 
ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో తొలి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుండటం, అధికార పార్టీ కావడంతో గెలిపించి ప్రత్యేకత చాటుకోవాలని శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గెలుపు కోసం ప్రయత్నించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top