ఆర్టీసీ ఉద్యోగులకు మరో తీపి కబురు!

CM KCR Extends Retirement Age To RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. 52 రోజుల సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష:
తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హమీల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఆర్టీసీలో కార్గో, పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సీఎం బోర్డు కూర్పు, పని విధానాన్ని కూడా ఖరారు చేశారు. సమీక్ష సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ, ఈడీ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top