ఎవరి ఆశలకు గండి పడుతుందో?

Chevella Constituency Polling Percentage Down - Sakshi

చేవెళ్లలో గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

2014తో పోల్చితే 6.67 శాతం తగ్గుదల

రాజకీయ పార్టీల్లో ఆందోళన

సాక్షి, రంగారెడ్డి జిల్లా:   చేవెళ్ల లోక్‌సభ పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్‌ శాతం ఎవరి విజయావకాశాలకు గండి కొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా పోలింగ్‌ శాతం తగ్గింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే ఈసారి పోలింగ్‌ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో అత్యధికంగా సెటిలర్లు ఉన్నారు. గురువారమే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉండటంతో.. సెటిలర్లు తమ సొంత ప్రాంతంలో ఓటేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

దీనికితోడు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు వరుస సెలవులు ఉండడంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్నికలు రావడంతో చాలామంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్‌సభ ఎన్నికలు రావడంతో..సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పైగా లోక్‌సభ ఎన్నికల ప్రాధాన్యతపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమూ ఒక కారణంగా చెప్పవచ్చు. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్‌ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్‌ శాతం నమోదైంది. క్షీణించిన పోలింగ్‌ శాతం ఎవరి గెలుపు అవకాశాలను కొంపముంచుతుందోనన్న బెంగ అభ్యర్థులను వెంటాడుతోంది. 
గత రెండు దఫాల్లో చేవెళ్లలో నమోదైన పోలింగ్‌ శాతం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top