వికారాబాద్/తాండూరుటౌన్: ‘అమ్మకు జెరం వచ్చిందిని.. మా అమ్మమ్మ ఇంటికి పోయివారం ఆయే. నిన్న రాత్రి అమ్మను దవఖానాకు సూపిస్కొస్త అని మా నాయిన గూడపోయిండు.. ఆల్లిద్ద రూ పొద్దుగూకినంక ఒస్తరనుకుంటే పొద్దుగాళ్ల పదిగంట్లకే మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చింది’అంటూ తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలు విలపించటం కన్నీరు పెట్టించింది. వికారాబాద్ జిల్లా హాజీపూర్‌కి చెందిన దంపతులు లక్ష్మి–బందెప్ప బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఉండటానికి చిన్న ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేని ఈ దంపతులు మృతితో వారి ఇద్దరు కూతుళ్లు శిరీష, భవానీ అనాథలయ్యారు.
వారిని ‘సాక్షి’ పరామర్శించగా తల్లడిల్లిపోయారు. ‘మాయమ్మ, మా నాయిన సచ్చిపోయిండ్రని సుట్టాలందరు ఒచ్చిండ్రు.. రేపెల్లుండి ఎవరిండ్లకు ఆల్లు పోతరు.. ఇంక నేను మా సెల్లె ఇంట్ల ఉండాలె. మాకింక దిక్కెవరు. మాయమ్మతోని కలిసి నేనుగూడ కూలికి పోతుంటి. వారం పదిదినాలసంది పానం బాగలేకపోతె మా అమ్మమ్మ ఇంటికి తోలిచ్చినం. దవాఖానాకు పోయి పానం బాగా చేపిచ్చుకొని ఒస్తమని పోయిండ్రు.. ఇప్పుడు మా నాయిన లేడు. మాయమ్మలేదు. ఎంత కష్టమైనా సరే నేను కూలికి పోయి మా సెల్లిని మంచిగ సదివిపిస్త. మా అమ్మమ్మను తోలుకొచ్చుకోని నా జతకు పండుకోబెట్టుకుంటా..’ అంటూ శిరీష చెప్పుకొచ్చింది.


