'డబ్బు'ల్‌ దెబ్బ | Central Government Stops Double Bedroom Housing Scheme Funds | Sakshi
Sakshi News home page

'డబ్బు'ల్‌ దెబ్బ

Oct 23 2019 11:37 AM | Updated on Oct 30 2019 1:39 PM

Central Government Stops Double Bedroom Housing Scheme Funds - Sakshi

గ్రేటర్‌లో దాదాపు 5లక్షల మంది డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు ఎప్పుడు ఇస్తారా? అని వీరందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.   
నగరంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ద్వారా రూ.1,500 కోట్లు రాయితీ ఇస్తోంది. ఇందులో రూ.600 కోట్లు ఏడాది క్రితమే విడుదల చేసింది. మిగతా నిధులు ఇచ్చేందుకూ సిద్ధంగానే ఉంది. కానీ లబ్ధిదారుల జాబితా అందకపోవడంతో నిలిపివేసింది.

సాక్షి, సిటీబ్యూరో: ఈ రెండూ నగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున చెల్లిస్తోంది. మొత్తం మూడు దశల్లో వీటిని విడుదల చేస్తోంది. తొలిదశ నిధుల విడుదలకు పెద్దగా అభ్యంతరాలుండవు. దాంతో మొదటిసారి గ్రేటర్‌కు రూ.600 కోట్లు విడుదల చేసింది. పురోగతిలోని పనులను బట్టి మిగతా నిధులు విడుదల చేస్తుంది. రెండో విడత నిధులు విడుదల చేసేందుకు గాను ఈ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అందజేయాల్సిందిగా బల్దియాను కోరింది. జాబితా పంపించాల్సిందిగా సంబంధిత శాఖ ప్రతినిధి గత వారం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను కలిసి కూడా సూచించారు. కానీ లబ్ధిదారుల ఎంపికే పూర్తి కాకపోవడంతో అధికారులు  ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ జాబితాను పంపితే మరో రూ.600 కోట్లు అందుతాయి. మిగతా రూ.300 కోట్లు తుది దశలో విడుదల చేస్తారు. పీఎంఏవై మార్గదర్శకాల మేరకు జాబితా తప్పనిసరి అని, తెలంగాణ మాత్రమే ఈ జాబితా పంపలేదని సమాచారం. 

నిధులందితేనే సకాలంలో...  
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. వీటి నిర్మాణానికి దాదాపు రూ.9,348 కోట్లు అవసరం ఉండగా... ఇప్పటి వరకు రూ.4,260 కోట్లు ఖర్చు చేశారు. 11 కాలనీల్లో దాదాపు 8వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిల్లో దాదాపు 1,400 పాత ఇళ్లు/గుడిసెల స్థానంలోనే నిర్మించినవి కావడంతో లబ్ధిదారులను వేరుగా గుర్తించాల్సిన పనిలేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఉంటే అదనంగా మరో 6,600 మంది గృహప్రవేశాలకు కూడా వీలుండేది. వీరి జాబితాను అందిస్తే రెండో దశలో కేంద్రం నుంచి రూ.600 కోట్లు వచ్చేవి. వాటితో మిగతా ఇళ్ల పనులు కూడా చకచకా ముందుకు సాగేవనే అభిప్రాయాలున్నాయి. కానీ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాకపోవడంతో ఈ పనులు జరగలేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా గ్రేటర్‌ పరిధిలో మాత్రం ఇళ్ల నిర్మాణానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అన్నీ సకాలంలో జరిగితే ఇప్పటికే ఇళ్లు పూర్తయ్యేవి. ఇప్పటికైనా సకాలంలో నిధులందితే అధికారుల అంచనా మేరకు వచ్చే జూన్‌ నాటికి పూర్తవుతాయి. లేని పక్షంలో మరింత ఆలస్యమవుతుంది.  

ఇదీ ‘డబుల్‌’ పరిస్థితి  
గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. వీటిలో ఆయా ప్రాంతాల్లోని వివాదాలు తదితర అంశాలతో దాదాపు 2వేల ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.  దాదాపు 8వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 30వేల ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి. సకాలంలో నిధులందితే వడివడిగా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. చేసిన పనులకే దాదాపు రూ.800 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

ఇళ్లు పూర్తయిన ప్రాంతాలివీ...
సింగం చెరువు తండా
గాజులరామారం
అమీన్‌పూర్‌
జమ్మిగడ్డ
సయ్యద్‌ సాబ్‌కా బాడా
కిడికీ బూద్‌అలీసా
అహ్మద్‌గూడ
డీపోచంపల్లి
బహదూర్‌పల్లి–1
బహదూర్‌పల్లి–2
ఎరుకల నాంచారమ్మ బస్తీ  
పైన పేర్కొన్న 11 ప్రాంతాల్లో దాదాపు 8వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement